పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు : రాహుల్ రాజ్ 

పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు :  రాహుల్ రాజ్ 

మెదక్​, వెలుగు: మెదక్​ లోక్​సభ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు రిటర్నింగ్ ​ఆఫీసర్, కలెక్టర్​ రాహుల్​రాజ్​ తెలిపారు. సోమవారం మెదక్ ​కలెక్టర్ ​ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ బాలస్వామితో కలిసి మాట్లాడారు. ఎలక్షన్​కమిషన్ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచే ఎలక్షన్​ కోడ్​ అమలులోకి వచ్చిందన్నారు.

ఎక్కడైనా కోడ్​ ఉల్లంఘన జరిగితే టోల్​ఫ్రీ నెంబర్​1950కి ఫిర్యాదు చేయొచ్చన్నారు. సీ విజిల్​ యాప్​ డౌన్​లోడ్​ చేసుకొని అందులో ఫొటోలు, వీడియోలు అప్​లోడ్ చేయొచ్చని, ఎఫ్ఎస్​టీ టీంలు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటాయన్నారు. స్టాటిస్టికల్​ సర్వేలెన్స్,​ వీడియో సర్వేలెన్స్​టీమ్​లను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఓటర్ జాబితాలో పేరు లేని వారు ఏప్రిల్ 15 వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు.

ఎస్పీ బాలస్వామి  మాట్లాడుతూ ఎన్నికల దృష్ట్యా ప్రజలు ఆధారాలు లేకుండా రూ. 50 వేలకు మించి నగదు తో ప్రయాణించవద్దని, ప్రతిరోజు తనిఖీలలో జప్తు చేసిన సొమ్మును జిల్లాలో ఏర్పాటు చేసే గ్రీవెన్స్ కమిటీకి అప్పగిస్తామని, ఆధారాలు సమర్పించి గ్రీవెన్స్ కమిటీ నగదు విడుదల చేస్తుందని తెలిపారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్ వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు. 

రాజకీయ పార్టీలు కోడ్ పాటించాలి 

ఎన్నికల ప్రవర్తన నియమావళిని పొలిటికల్​పార్టీలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు.  గుర్తింపు పొందిన పొలిటికల్​పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా, ఎన్నికల నియమావళి పై  సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘనకు పాల్పడరాదని తెలిపారు. రాజకీయ పార్టీలు తమ ప్రచార వివరాలను తెలియజేయాలని తెలిపారు.