నిర్మల్, వెలుగు: నిర్మల్ పట్టణంలోని రోడ్లపై ఏర్పడిన గుంతల రిపేర్ల కోసం కలెక్టర్ అభిలాష అభినవ్ కొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఇటీవల భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, ఏర్పడిన గుంతల రిపేర్ల కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టిన కలెక్టర్.. సమస్యను పరిష్కరించేందుకు కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. రోడ్లపై ఏర్పడిన గుంతలను సంబంధిత అధికారులు గుర్తించి రిపేర్లు మొదలుపెట్టారు. అయితే అధికారులు గుర్తించని గుంతలను ప్రజలు గుర్తించి ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ను తెరపైకి తెచ్చారు.
‘పాట్ హోల్ ఫ్రీ రోడ్స్.. స్పెషల్ డ్రైవ్ నిర్మల్ మున్సిపాలిటీ’ పేరుతో ఈ క్యూఆర్ కోడ్ ను ప్రారంభించారు. ప్రజలు తాము గుర్తించిన గుంతలను ఫోటోలు తీసి ఈ క్యూఆర్ కోడ్ తో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. క్యూఆర్ కోడ్ ద్వారా మున్సిపల్ అధికారులు రోడ్లపై గుంతలను గుర్తించి వెంటనే రిపేర్లు చేపడుతారని స్పష్టం చేశారు.
