వనపర్తి, వెలుగు: జిల్లాలో రానున్న వారం రోజుల్లో భారీగా వడగాలులు వీచే అవకాశం ఉన్నందున, ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో అన్ని జిల్లా శాఖల అధికారులతో ఎండాకాలం వడగాలులపై సమావేశం నిర్వహించి, అధికారులకు తగిన సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రానున్న వారం రోజుల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతతో భారీ వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. అన్ని మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా వాటర్ బాటిల్ తీసుకెళ్లాలని సూచించారు. ఆఫీసులు, ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పనుల్లో పాల్గొనే కూలీల కోసం పని ప్రదేశాల్లో చల్లని తాగునీరు, చలువ నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 18వ తేదీ వరకు నిర్వహించనున్న ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ వినోద్ కుమార్, జడ్పీ సీఈవో యాదయ్య, డీఎస్పీ బాలాజీ నాయక్, డీటీఓ మానస, డీఆర్టీఓ ఉమాదేవి, సీపీఓ హరికృష్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

