వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లాలో మామిడి రైతులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని, ఎక్కువ ధర కల్పించేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మామిడి కొనుగోలుదారులు-అమ్మకందారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రైతులు ప్రదర్శించిన వివిధ రకాల మామిడి వంగడాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా 40 మంది రైతులు 250 టన్నుల మామిడి ఎగుమతి కోసం ఎగుమతిదారులతో ఒప్పందాలు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రబీ సీజన్ ధాన్యం సేకరణలో భాగంగా 10 శాతం బ్యాంక్ గ్యారంటీ సమర్పించి, అగ్రిమెంట్ చేసుకున్న మిల్లులకే ధాన్యం కేటాయిస్తామని స్పష్టం చేశారు. గత సీజన్ పెండింగ్ బియ్యాన్ని వెంటనే ఎఫ్ సీఐకి అప్పగించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ వినోద్ కుమార్ ఉన్నారు.

