స్థానిక సంస్థల ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

స్థానిక సంస్థల ఎన్నికలు  పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
  • ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులకు సూచించారు.  సోమవారం కలెక్టరేట్ లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై ఆయన అధికారులతో సమీక్షించారు. స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసినట్లు తెలిపారు. ప్రతీ శాఖ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పనిచేసి ప్రశాంతంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సహకారం అందించాలన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో మండల ప్రత్యేక అధికారులు కీలకపాత్ర పోషించాలని సూచించారు. 

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను తప్పకుండా పాటించాలన్నారు. వానాకాలం ధాన్యం కొనుగోలుకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని, గతంలో వచ్చిన ఇబ్బందులు పునరావృతం కాకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పెండింగ్ సీఎంఆర్ డెలివరీ గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పత్తి కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధర అందేలా చూడాలన్నారు. క్రాప్ బుకింగ్ 50 శాతం మాత్రమే జరిగిందని, వ్యవసాయ విస్తరణ అధికారి తన పరిధిలో సాగు అవుతున్న పంట విస్తీర్ణం వివరాలు సేకరించి అక్టోబర్ 5 లోపు క్రాప్ బుకింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ, జడ్పీ సీఈఓ దీక్షా రైనా పాల్గొన్నారు.

 పీఎం సూర్య ఘర్ ముప్త్ బిజిలి యోజనపై సమీక్ష

రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుపై అవగాహన కలిగి ఉండి, అర్హత కలిగిన గృహ వినియోగదారులు ఏర్పాటు చేసుకునేలా చూడాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన అధికారులతో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజనపై సమీక్ష నిర్వహించారు. పీఎం సూర్య ఘర్ ముప్త్ బిజిలి యోజన పథకం, సేవా పర్వ్ పై వివరాలను తెలంగాణ నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎస్ఈ శ్రీనివాసచారి వివరించారు. 

అనంతరం కలెక్టర్​ మాట్లాడుతూ పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి  యోజన స్కీం ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా పర్వ్ పేరిట అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇంటిపై కప్పుపై సౌర ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే ఇంటి యజమానులకు విద్యుత్ ఖర్చు తగ్గడంతో భారీ ప్రయోజనం కలుగుతుందని, అర్హత ఉన్న కుటుంబాలు www.pmsuryaghar.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

 పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించడంలో ఈ పథకం ముఖ్య పాత్ర పోషిస్తుందని,  ఇంటిపై 1 కిలో వాట్ సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు రూ.30 వేలు, 2 కిలో వాట్ ఏర్పాటు రూ.60 వేలు, 3 కిలో వాట్ ఏర్పాటు రూ.78 వేలు సబ్సిడీ వస్తుందని, మిగిలిన నిధులు బ్యాంకు లోన్ ద్వారా సమకూర్చుకోవచ్చని చెప్పారు.