ఖమ్మం జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పేలా ప్రోత్సహించాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పేలా ప్రోత్సహించాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
  • జిల్లా టీజీ ఐపాస్ కమిటీ సమావేశంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి 

ఖమ్మం టౌన్,వెలుగు: జిల్లాలో యూనిట్ల స్థాపన అనుమతికై వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలు నిర్దిష్ట సమయంలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి టీజీ ఐ-పాస్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.  గత సమావేశంలో చర్చించిన 25 యూనిట్లకు సంబంధించి వివిధ రకాల 57 అనుమతుల విషయమై అభ్యంతరాలను కలెక్టర్ సమీక్షించారు. 

 గ్రానైట్, రైస్ మిల్లులు, క్రూడ్ పామాయిల్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తదితరాలున్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ..  జిల్లాలో పారిశ్రామిక యూనిట్ల స్థాపనకు వనరులు ఉన్నాయన్నారు.  పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే పారిశ్రామిక ఔత్సాహికులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలన్నారు.  

అనుమతులు ప్రభుత్వ నిబంధనలకు లోబడి వేగంగా ఇవ్వాలన్నారు. పరిశ్రమల స్థాపనతో స్థానిక యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు.  ప్రకృతి విపత్తుల నిర్వహణకు రక్షణ సామగ్రిని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తహసీల్దార్లకు అందజేశారు. 

సమావేశంలో ఇండస్ట్రీస్ జీఎం సీతారాం, ఏడీ మైన్స్ సాయినాథ్, ఆర్టీవో వెంకటరమణ, జిల్లా ఉపాధి కల్పన అధికారి కె. శ్రీరామ్, వివిధ శాఖల అధికారులు, గ్రానైట్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. యుగంధర్, ప్రధాన కార్యదర్శి కె. గోపాల్ రావు, జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ, కలెక్టరేట్ ఏవో కె. శ్రీనివాసరావు, తహశీల్దార్లు రాంప్రసాద్, అరుణ, శ్వేత, కలెక్టరేట్ పర్యవేక్షకులు శర్మ, అధికారులు, 
తదితరులు ఉన్నారు.