నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్​ అనుదీప్ దురిశెట్టి

నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్​ అనుదీప్ దురిశెట్టి

హైదరాబాద్, వెలుగు : ఇయ్యాల నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల స్వీకరణకు హైదరాబాద్ జిల్లాలోని రిటర్నింగ్ అధికారుల ఆఫీసుల్లో(ఆర్వో సెంటర్లు) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. గురువారం కార్వాన్, బహదూర్​పురా, చాంద్రాయణగుట్ట, చార్మినార్, మలక్​పేట సెగ్మెంట్లలోని ఆర్వో సెంటర్లను ఆయన తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...  నామినేషన్ల స్వీకరణకు చేసిన ఏర్పాట్లు, నామినేషన్ ఫామ్​లు, అభ్యర్థులు తప్పనిసరిగా సమర్పించాల్సిన సర్టిఫికెట్లు, ఎన్నికల రూల్స్ ప్రకారం రిటర్నింగ్ అధికారి పాటించాల్సిన నిబంధనలు, హెల్ప్ డెస్క్, ఆన్ లైన్ నామినేషన్ల స్వీకరణ తదితర వివరాలను రిటర్నింగ్ అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు.

నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే అనుమతించాలని సూచించారు. రిటర్నింగ్ అధికారి ఆఫీసుకు రెండు వైపులా 100 మీటర్ల దూరంలో బారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం మూడు గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారమన్నారు. ఆర్వో సెంటర్లలో సీసీ కెమెరాలు, వీడియో గ్రాఫర్, డిజిటల్ వాల్ క్లాక్, ఫొటోగ్రాఫర్లను నియమించుకోవాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు ఉన్నారు.

రంగారెడ్డిలో..

రంగారెడ్డి కలెక్టరేట్/ ఎల్ బీనగర్/ : రంగారెడ్డి జిల్లాలోని 8 అసెంబ్లీ సెగ్మెంట్లలో నామినేషన్ల స్వీకరణ కోసం ఆర్వో సెంటర్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ భారతి హోళీకేరి తెలిపారు.  గడ్డి అన్నారం బల్దియా జోనల్ ఆఫీసులో ఏర్పాటు చేసి ఎల్ బీనగర్ సెగ్మెంట్​కు సంబంధించి ఆర్వో సెంటర్​ను గురువారం  కలెక్టర్ సందర్శించారు. నామినేషన్ల స్వీకరణ సంబంధించి ఏర్పాట్లు, ఇతర వివరాల గురించి రిటర్నింగ్ అధికారి పంకజను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ సెగ్మెంట్లకు సంబంధించి ఆయా ఏరియాల్లోని ఆర్డీవో ఆఫీసుల్లో ఆర్వో సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. మహేశ్వరం సెగ్మెంట్​కు సంబంధించి తహసీల్దార్ ఆఫీసులో, శేరిలింగంపల్లి సెగ్మెంట్​కు సంబంధించి బల్దియా జోనల్ ఆఫీసులో, కల్వకుర్తి సెగ్మెంట్​కు సంబంధించి అక్కడి తహసీల్దార్ ఆఫీసులో ఆర్వో సెంటర్లు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. 

చేవెళ్లలో..

చేవెళ్ల : చేవెళ్లలోని ఆర్డీవో ఆఫీసులో ఆర్వో సెంటర్ ఏర్పాటు చేసినట్లు రిటర్నింగ్ అధికారి సాయిరాం తెలిపారు. చేవెళ్ల సెగ్మెంట్​లోని 5 మండలాల్లో 2 లక్షల 53 వేల 972 మంది ఓటర్లున్నట్లు ఆయన చెప్పారు. అక్టోబర్ 31 నాటికి 5,787 మంది కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. చేవెళ్లలో ఏర్పాటు చేసిన 3 చెక్ పోస్టుల్లో ఇప్పటి వరకు చేపట్టిన తనిఖీల్లో రూ.2 కోట్ల 9 లక్షల డబ్బును పట్టుకున్నామని ఆయన వివరించారు. పోలీసులు 456 లీటర్ల లిక్కర్​ను, ఎక్సైజ్ శాఖ 549 లీటర్లను పట్టుకుందన్నారు. 
 
షాద్​నగర్​లో..

షాద్​నగర్ : షాద్ నగర్​లోని ఆర్డీవో ఆఫీసులో ఆర్వో సెంటర్ ఏర్పాటు చేసినట్లు రిటర్నింగ్ అధికారి మాధవరావు తెలిపారు. సెగ్మెంట్​లో మొత్తం 254 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఇందులో 73 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు చెప్పారు. సెగ్మెంట్ పరిధిలోని 6 మండలాల్లో 2 లక్షల 25 వేల 470 మంది ఓటర్లు ఉన్నారన్నారు. అక్టోబర్ 31 నాటికి 6,051 మంది కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన వివరించారు.సెగ్మెంట్​లో ఏర్పాటు చేసిన 3 చెక్ పోస్టుల్లో ఇప్పటి వరకు రూ. కోటి 71 లక్షల 9 వేల 160 డబ్బు పట్టుకున్నామన్నారు. 1,756 లీటర్లను సీజ్ చేశామన్నారు.