ఖమ్మంను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మంను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం తెల్లవారుజామున జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి నగరంలో ఆయన పర్యటించారు. ప్రధాన రహదారులు, పార్కులు, మయూరి సెంటర్, వైరా రోడ్, ప్రభుత్వ హాస్పిటల్, ఇల్లందు క్రాస్ రోడ్ సెంటర్లలో పారిశుధ్య పనులను పరిశీలించారు.

 చెత్త సేకరించే కార్మికులు, జవాన్లతో కలెక్డర్ ముచ్చటించారు. సైడ్ డ్రెయిన్లు శుభ్రపర్చాలని, రోడ్డులో పేరుకపోయిన మట్టి ఎత్తివేయాలని, డివైడర్స్ లోని మొక్కలను కాపాడాలని కార్మికులకు సూచించారు. బైపాస్ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, శ్రీశ్రీ రోడ్​లో మరమత్ములు చేసిన గుంతల నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు. 

సీపీఆర్ పై అవగాహన కలిగి ఉండాలి.. 

సీపీఆర్ పై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులకు సూచించారు. కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో సీపీఆర్ పై అధికారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాసరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల హార్ట్ ఎటాక్ వల్ల చాలా మంది మరణిస్తున్నారని తెలిపారు. 

హార్ట్ ఎటాక్ వచ్చిన వెంటనే సీపీఆర్ చేయడం వల్ల మనిషి ప్రాణాలు కాపాడేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. అనంతరం కలెక్టరేట్ లో ఇందిరా డెయిరీ, జాతీయ రహదారులు, ఉద్యోగుల అటెండెన్స్ వంటి అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు ఈవీఎం గోడౌన్ ను పరిశీలించి గదులకు సీల్​ వేయించారు.