జాతీయ రహదారి 163జీ భూసేకరణ సమస్యలను పరిష్కరించాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

జాతీయ రహదారి 163జీ భూసేకరణ సమస్యలను పరిష్కరించాలి :  కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం టౌన్, వెలుగు : జాతీయ రహదారి 163జీ భూసేకరణ సమస్యలను పరిష్కరించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారి 163జీ పెండింగ్ భూ సేకరణపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు.  అమరావతి -నాగపూర్ జాతీయ రహదారి 163జీ  కింద వైరా, బోనకల్, చింతకాని మండలంలో చెల్లింపులకు సంబంధించి ఉన్న సమస్యలను ఇక్కడ భూ బదలాయింపు జరిగినందున పనులు త్వరగా చేపట్టాలన్నారు.

 రఘునాథపాలెం మండలం వీవీ  పాలెంలో 2.32 హెక్టార్లకు  సంబంధించి 3డీ గెజిట్ ప్రచురించి, నవంబర్ చివరి నాటికి అవార్డు పాస్ చేయాలని ఆదేశించారు. వీవీ పాలెంలో 9.98 హెక్టార్లకు సంబంధించి అవార్డు పాస్ చేశామని, వీరికి పరిహారం అందించి నవంబర్ 15 నాటికి ఈ భూమి బదలాయించాలని చెప్పారు.  ఆ ప్రాంతంలో ఎక్కువ రేటుతో జరిగిన రిజిస్త్రేషన్​ విలువ ఆధారంగా రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు. 

చింతకాని మండలం వందనం గ్రామంలో పెండింగ్ స్ట్రక్చర్ పరిహారం చెల్లింపు వేగవంతం చేయాలన్నారు. ఖమ్మం-–విజయవాడ సంబంధించి ప్యాకేజీ 2  కింద ఎర్రుపాలెం మండలంలోని రెమిడిచెర్ల, ఎర్రుపాలెం, తక్కలపాడు గ్రామాల్లో రీ-సర్వే ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, దీనిని ఖమ్మం ఆర్డీవో పర్యవేక్షించాలని ఆదేశించారు. వరంగల్–-ఖమ్మం ప్యాకేజీ3 కి సంబంధించి ఖమ్మం రూరల్ మండలం తీర్థాల, రేగుల చలక, కామాంచికల్ గ్రామాలకు సంబంధించి బాధితులకు పరిహారం పంపిణీ పూర్తి చేసి,ఆ భూమిని జాతీయ రహదారుల అథారిటీకి అప్పగించాలన్నారు.

 తీర్థాల, రేగులచలక, కామాంచికల్, మల్లెమడుగు, రఘునాథపాలెం గ్రామాలకు సంబంధించి కోర్టు స్టే జూన్ 10 న ముగిసిన నేపథ్యంలో పరిహారం సంబంధిత కోర్టులలో డిపాజిట్ చేసి భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్పారు. ఖమ్మం జిల్లా పరిధిలో ఎన్ హెచ్ 365 ఏ, బీ, 563 జి సంబంధించి బ్లాక్ స్పాట్స్ గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో నేషనల్ హైవే  పీడీ దివ్య, తహసీల్దార్లు, కలెక్టరేట్ భూ సేకరణ విభాగం సెక్షన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కొరత ఉండొద్దు.. 

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా  అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు.  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక లభ్యతపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రతీ సోమవారం లబ్ధిదారులకు నిర్మాణ పురోగతి ఆధారంగా బిల్లులు చెల్లిస్తున్నట్లు తెలిపారు. చింతకాని, బోనకల్ మండలాల్లో ఇసుక సమస్య కారణంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఆలస్యమవుతుందని, ఈ సమస్య పరిష్కారానికి ముదిగొండ మండలం నుంచి ఇసుక స్టాక్ తెప్పించి చింతకాని, బోనకల్ మండలాల్లో ఇసుక డంప్ ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. 

సిటిజన్ సర్వే లో అందరూ పాల్గొనాలి

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకు ఉద్దేశించిన తెలంగాణ  రైజింగ్ - 2047 సిటిజన్ సర్వే లో అందరూ పాల్గొనాలని కలెక్టర్ అనుదీప్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.  ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ఇప్పటివరకు ఈ సిటిజన్ సర్వే లో తెలంగాణలోని వివిధ ప్రాంతాల పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందజేశారని పేర్కొన్నారు.