15 రోజుల్లో రెవెన్యూ దరఖాస్తులను పరిష్కరించాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

 15 రోజుల్లో రెవెన్యూ దరఖాస్తులను పరిష్కరించాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం టౌన్, వెలుగు : పెండింగ్ లో ఉన్న రెవెన్యూ సదస్సు దరఖాస్తులను 15 రోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు.  కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులు, సాదాబైనామా, ప్రభుత్వ భూముల సంరక్షణ, మీసేవ సర్టిఫికెట్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్  దరఖాస్తుల వంటి అంశాలపై చర్చించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూశాఖ పని తీరు ఆధారంగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. జిల్లాలో రెవెన్యూశాఖ పనితీరు సంతృప్తికరంగా లేదని, సిబ్బంది పనితీరు మార్చుకోవాలని చెప్పారు. రాబోయే 15 రోజుల్లో స్పష్టమైన మార్పు కనిపించాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఆమోదించిన దరఖాస్తుల్లో కొన్ని దరఖాస్తులు మాత్రమే భూభారతిలో అప్ డేట్ కావడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పని చేయడం ఇష్టం లేని అధికారులు సెలవుపై వెళ్లాలని, అనవసరంగా ప్రజలను ఎదురు చూసేలా చేయవద్దన్నారు. మండలాల్లో తిరస్కరించిన దరఖాస్తులు, దానికి గల కారణాలను తెలియజేస్తూ రిపోర్ట్ అందించాలని తహసీల్దార్లను ఆదేశించారు. సీతారామ ఎత్తిపోతల పథకం, జవహార్ ఎత్తిపోతల పథకం, ఎస్సారెస్పీ స్టేజీ–2 వంటి నీటిపారుదల ప్రాజెక్టు పనుల భూ సేకరణపై కలెక్టర్ చర్చించారు. 

మీ సేవా సర్టిఫికెట్లను పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు సకాలంలో జారీ చేయాలని చెప్పారు. పెండింగ్ ఉన్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే సమయం తీసుకుని త్వరగా పంపిణీ చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పద్మశ్రీ, సర్వే ల్యాండ్ రికార్డ్ ఏడీ శ్రీనివాసులు, ఖమ్మం రెవెన్యూ డివిజన్ అధికారి నరసింహారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.