శ్రీవారి ఆలయ నిర్మాణంతో ఖమ్మంకు కొత్త శోభ : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

శ్రీవారి ఆలయ నిర్మాణంతో ఖమ్మంకు కొత్త శోభ : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం టౌన్, వెలుగు: కొత్తగా నిర్మించనున్న తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం పూర్తయితే ఖమ్మం జిల్లా ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఖమ్మంలో టీటీడీ ఆధ్వర్యంలో కొత్తగా వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు కావలసిన స్ధలాల సేకరణ కోసం ఆదివారం కలెక్టర్ క్షేత్రస్ధాయిలో పర్యటించారు. 

నగరంలోని 15వ డివిజన్ లో కొత్తగూడెం, అల్లీపురంలోని ప్రభుత్వ భూములకు సంబంధించి మ్యాప్ లను పరిశీలన చేసి అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి పలు స్థలాలను పరిశీలించామని, టీటీడీ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగారెండు, మూడు స్థలాలను ప్రతిపాదించామని చెప్పారు. టీటీడీ అధికారులు, స్తపతి, పండితులు ఖమ్మం నగరానికి వచ్చి ప్రతిపాదిత స్థలాలను పరిశీలించి, అనువైన భూమిని ఖరారు చేస్తారని తెలిపారు. కలెక్టర్​ వెంట ఖమ్మం ఆర్డీవో నరసింహారావు, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.