స్టూడెంట్స్ కష్టపడే తత్వం అలవర్చుకోవాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

స్టూడెంట్స్ కష్టపడే తత్వం అలవర్చుకోవాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం టౌన్,వెలుగు :   ఎక్కడ ఉన్న, ఏం చదివిన కష్టపడే తత్వం ఉన్నప్పుడే అనుకున్నది సాధిస్తామని ఖమ్మం  కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్టూడెంట్స్​కు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలో మిషన్ వాత్సల్య కార్యక్రమంలో భాగంగా పీఎం కేర్స్ పథకం కింద పిల్లలకు ఆర్థిక అక్షరాస్యత పై అవగాహనకార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పీఎం కేర్స్ కింద రూ.10 లక్షల పోస్టల్ డిపాజిట్, వారి చదువు, కెరీర్ పరంగా స్థిరపడేలా ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తున్నామని తెలిపారు. 

జిల్లాలో కోవిడ్ బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన 13 మంది పిల్లలను గుర్తించి వారి పేర రూ.10 లక్షలు పోస్టల్ డిపాజిట్ చేశామని, ఈ మొత్తం వారికి 23 సంవత్సరాల వయస్సులో డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. సర్టిఫికెట్లు భద్రపర్చుకొనే ఫోల్డర్, ఆర్థిక అక్షరాస్యత పై అవగాహనకు సంబంధించి పుస్తకం, పోస్టల్ డిపాజిట్ పుస్తకాన్ని పిల్లలకు ఆయన అందజేశారు. అనంతరం పిల్లలతో కలిసి కలెక్టర్​ మధ్యాహ్న భోజనం చేశారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె. రాంగోపాల్ రెడ్డి, జిల్లా బాలల సంరక్షణ కమిటీ చైర్ పర్సన్ భారతి రాణి, జిల్లా బాలల పరిరక్షణ అధికారిణి విష్ణు వందన, సంక్షేమ శాఖ అధికారులు, పిల్లలు, పిల్లల సంరక్షకులు,  తదితరులు పాల్గొన్నారు. అనంతరం చింతకాని మండలం రామకృష్ణాపురం చెరువు అలుగు పారడంతో  బోనకల్ ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న  వరదను ధంసలాపురం వద్ద కలెక్టర్ పరిశీలించారు. అధికారుల, ప్రజలు  అలర్ట్​గా ఉండాలని ఆయన సూచించారు. అనంతరం  చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో బిటెక్ రెండో సంవత్సరం చదువుతున్న పేద విద్యార్థిని ఉప్పు వాసంతికి  లాప్‌టాప్ అందజేశారు.