ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
  • మెడికల్ కాలేజీ నిర్మాణ పనుల పరిశీలన

ఖమ్మం, వెలుగు: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. బుధవారం బల్లెపల్లిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను ఆయన తనిఖీ చేశారు. కాలేజీ బిల్డింగ్, మెడికల్ కళాశాల విద్యార్థుల, ప్రొఫెసర్ల వసతి గృహాలు, భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఇంటర్నల్ రోడ్లు, ప్రహారీ, ప్రధాన రహదారిలో ఆర్చీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తర్వాత ఖమ్మంలో యంగ్ ఇండియా స్కూల్ ప్రతిపాదిత స్థలాన్ని అడిషనల్​ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి పరిశీలించారు.

 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ మ్యాప్ లను, నిర్ధేషిత స్థలాన్ని పరిశీలించారు. సూమారు 21 ఎకరాల్లో  అన్ని వసతులతో స్కూలు బిల్డింగ్​ నిర్మాణాన్ని గడువులోగా పూర్తి చేయాలన్నారు.  వచ్చే విద్యా సంవత్సరం నాటికి పనులు పూర్తి చేసి పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఈఈ పవార్, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దారు సైదులు, రఘునాథపాలెం తహసీల్దార్ శ్వేత పాల్గొన్నారు.

పైలెట్ ప్రజావాణి అమలుకు చర్యలు

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు జవాబుదారితనంతో పని చేయాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. మధిర నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో చేపట్టనున్న పైలెట్ ప్రజావాణి నిర్వహణపై ఖమ్మంలో బుధవారం అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి  కలెక్టర్​ మాట్లాడారు. ప్రజావాణికి అందినప్రతి దరఖాస్తును పరిష్కరించాలని, పరిష్కారం చేయలేని దరఖాస్తులకు తప్పనిసరిగా కారణాలు తెలియజేస్తూ లేఖ రాయాలని సూచించారు. 

ప్రతినెలా మండల స్థాయిలో పబ్లిక్ హియరింగ్ నిర్వహించి దరఖాస్తుల ప్రొగ్రెస్​పై  సంబంధిత అధికారులు సమాధానం చెబుతారని, మండల స్థాయి అధికారులంతా పబ్లిక్ హియరింగ్ కు హాజరు అవుతారని తెలిపారు. పైలట్ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తుపై  తీసుకున్న చర్యలను వివరిస్తూ సంబంధిత అధికారులు 30 రోజులలో రిపోర్టు సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ దీక్షా రైనా పాల్గొన్నారు.

పారదర్శకంగా గ్రామ పరిపాలనా అధికారుల కౌన్సిలింగ్

పైరవీలకు అవకతవకలకు ఆస్కారం లేకుండా గ్రామ పరిపాలనా అధికారులకు కౌన్సిలింగ్ నిర్వహించి, పోస్టింగ్​లు ఇస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. కలెక్టరేట్ లోని మీటింగ్​ హాల్​లో గ్రామ పరిపాలనా అధికారులకు నిర్వహించిన కౌన్సెలింగ్ లో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. జిల్లాలోని 299 క్లస్టర్లలో గ్రామ పరిపాలనా అధికారుల నియామకానికి కౌన్సిలింగ్ చేపట్టినట్లు తెలిపారు. ప్రజావాణిలో, గ్రామాల సందర్శన సందర్భంగా ఎక్కువగా భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులు వస్తున్నాయని, వీటిని పరిష్కరించే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఏ. రాజేశ్వరి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సునీల్ రెడ్డి పాల్గొన్నారు.

నిబంధనల ప్రకారం లేఔట్ కు పర్మిషన్​

ఖమ్మం నగరంలో లేఔట్ అనుమతుల జారీలో నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలని కలెక్టర్ అనుదీప్  అధికారులకు సూచించారు. కేఎంసీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన లేఔట్ కమిటీ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి కలెక్టర్​ మాట్లాడారు. లేఔట్ అనుమతులను నిబంధనల ప్రకారం జారీ చేయాలని అన్నారు.  చివరి నిమిషంలో నాలా కన్వర్జేషన్ ప్రతిపాదనలను  మరోసారి పరిశీలించాలన్నారు. 

లేఔట్ లో స్ట్రీట్ లైట్స్, సీవరేజి వ్యవస్థ, డ్రైనేజీ వ్యవస్థ తాగునీటి సరఫరా విద్యుత్ సరఫరా తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. సమావేశంలో ఎస్డీసీ ఎం. రాజేశ్వరి, సుడా సీపీఓ, పంచాయతీ రాజ్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసా చారి, ఆర్ అండ్ బీ ఎస్ఈ యాకోబు, ఈఈ తానేశ్వర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు.