
- ఆస్పత్రుల పనితీరుపై సమీక్ష
ఖమ్మం టౌన్, వెలుగు : మెరుగైన సేవలతో ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. గురువారం కలెక్టరేట్ లో తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులపై సమీక్షించారు. వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులు బాగా పనిచేస్తే హయ్యర్ రెఫరల్ ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గడమే కాకుండా ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజలకు నమ్మకం కలుగుతుందని ఆయన చెప్పారు.
జిల్లాలో ఉన్న ఏడు వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య విధానం పరిషత్ ఆస్పత్రుల్లో ప్రసవాలు జూలైలో 47 నుంచి సెప్టెంబర్ లో 74 కు చేరాయని, 10 మంది గైనకాలజిస్ట్ లు ఉన్నప్పటికీ కేవలం 74 ప్రసవాలు మాత్రమే జరగడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పీహెచ్సీల అధికారులతో వెంటనే సమావేశం నిర్వహించాలని, ప్రతి ఏరియాలో ఆ నెల ఎన్ని ప్రసవాలు జరిగే అవకాశం ఉంటుందో పరిశీలించాలన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో నెలకు కనీసం 200 ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య విధాన పరిషత్ సంబంధించి డయాగ్నోస్టిక్ హబ్ కు పంపే పరీక్షల శాంపిల్స్ చాలా తక్కువగా నమోదు కావడానికి గల కారణాలు కలెక్టర్ ఆరా తీశారు. ఈ సమావేశంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర్, పాలేరు నియోజకవర్గం ప్రత్యేక అధికారి రమేశ్, సూపరింటెండెంట్లు, సంబంధిత వైద్య అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ఆలయానికి స్థలం అప్పగించాలి
జిల్లాలో తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి స్థలం అప్పగించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో తెలంగాణ దేవాదాయ శాఖ స్థపతి ఎన్. వాళ్లినాయగం, అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి సమీక్షించారు. ఖమ్మం అర్బన్ మండలంలోని అల్లీపురం వద్ద 20 ఎకరాల స్థలం గుర్తించి, తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి కేటాయించినట్లు తెలిపారు. ఆలయ నిర్మాణం, విడిది, అన్ని వసతులకు అనువుగా స్థల సేకరణ చేశామన్నారు. వేద పాఠశాల, కళ్యాణ మండపం, కళాక్షేత్రం, భజన మండపం తదితర అన్ని సౌకర్యాల కల్పనకు ఆగమ శాస్త్ర ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.
స్లాట్ బుకింగ్ పద్దతుల్లో పత్తి కొనుగోళ్లు...
పత్తి రైతులకు దళారుల సమస్యలు లేకుండా ఇక నుంచి నేరుగా స్లాట్ బుకింగ్ పద్ధతిలో పత్తి పంటను విక్రయించే అవకాశం ప్రభుత్వం కల్పించిందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కపాస్ కిసాన్ యాప్ ను ప్రవేశ పెట్టిందని, ఈ యాప్ ను రైతులు స్మార్ట్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.