
- ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పునఃనిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ అనుదీప్
ఖమ్మం టౌన్, వెలుగు : అభివృద్ధి పనులు ఇన్టైంలో పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ను మోడల్ మార్కెట్ గా పునిర్మారణ అభివృద్ధి పనులను అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసిగురువారం ఆయన పరిశీలించారు. పనులకు సంబంధించి మ్యాప్ లను పరిశీలించి పలు సూచనలు చేశారు. రైతులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడంలో రాజీ పడొద్దన్నారు.
నిపుణుల కమిటీ సూచనల ప్రకారం చేసిన డిజైన్ ల ప్రకారం నిర్మాణం పక్కాగా జరగాలన్నారు. రైతుల వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, వివరాలు తెలిపేలాగా ఎల్ఈడీ బోర్డులు, విశాలమైన పెద్ద షెడ్ లు, సరుకు నాణ్యత తెలిపే గ్రేడింగ్ యంత్రాలు, తేమశాతం నిర్ధారించే మిషన్లు, స్వచ్ఛమైన తాగునీటి కోసం ఆరు ప్రాంతాల్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్లు, నాలుగు టాయిలెట్ కాంపెక్ల్స్ లు, రైతుల ఆరోగ్య సమస్యలకు హెల్త్ సెంటర్, ఇస్కాన్ సహకారంతో రుచికరమైన భోజన వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, వైస్ చైర్మన్ రమేశ్, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎంఏ అలీమ్, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దారు సైదులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.