ఖమ్మం జిల్లాలోపర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు : కలెక్టర్ అనుదీప్

ఖమ్మం జిల్లాలోపర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు : కలెక్టర్ అనుదీప్
  • రోప్ వే ఏర్పాటుతో ఖమ్మం ఖిల్లాకు పర్యాటక శోభ
  • ఖమ్మం ఖిల్లా, జాఫర్ బావిని సందర్శించిన కలెక్టర్ అనుదీప్​

ఖమ్మం టౌన్, వెలుగు :  ఖమ్మం జిల్లాను పర్యాటక రంగంలో ఉన్నతంగా అభివృద్ధి చేయాలని, అందుకు పక్కా ప్రణాళికలతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శనివారం ఖమ్మం ఖిల్లా రోప్ వే నిర్మాణ ప్రాంతం, జాఫర్ బావి మరింత సుందరీకరణ కోసం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య తో కలిసి కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సందర్శించారు.  చేపట్టాల్సిన పర్యాటక పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.

 రూ. 29 కోట్లతో చేపడుతున్న ఖమ్మం ఖిల్లా రోప్ వే నిర్మాణానికి చర్యలు వేగవంతం చేయాలన్నారు. జాఫర్ బావి, ఖిల్లా అభివృద్దితో ఖమ్మం పర్యాటక ప్రాంతంగా మారుతుందని చెప్పారు.   ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి సుమన్ చక్రవర్తి, నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ అనిల్ కుమార్, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ సైదులు ఉన్నారు. 

టీచర్ల పాత్ర కీలకం

సాంకేతికత ఎంత అందుబాటులో ఉన్న తరగతి గదుల్లో టీచర్ల పాత్ర కీలకమని, టీచర్ కు విద్యార్థి జీవితాన్ని పూర్తిగా మార్చే సామర్థ్యం ఉంటుందని కలెక్టర్ అనుదీప్ అన్నారు. కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో టీచర్స్ డే సందర్భంగా శనివారం నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో కలెక్టర్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పి. శ్రీపాల్ రెడ్డి, అడిషనల్​కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదులో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో ఉందని, ఇదే స్ఫూర్తితో ఖమ్మం జిల్లా విద్యాశాఖ మరిన్ని మెరుగైన మంచి ఫలితాలు సాధించాలన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన టీచర్లను ఘనంగా సన్మానించి మెమెంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ దీక్ష రైనా, మండల విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు. 

ముస్తఫానగర్ పీహెచ్​సీ తనిఖీ 

పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిపుష్టికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. స్థానిక ముస్తఫానగర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపి సేవలు, ఐపీ సేవలు, డ్రగ్ స్టోర్ లను పరిశీలించారు. పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందేలా, నిరంతరం అందుబాటులో ఉండేలా  డాక్టర్లు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో ఎట్టిపరిస్థితుల్లో మందుల కొరత లేకుండా చూసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా చూడాలన్నారు. కలెక్టర్​ వెంట వైద్యాధికారులు డాక్టర్. కె. రమేశ్​, సిబ్బంది ఉన్నారు.