
కామారెడ్డి, వెలుగు: జిల్లాలో పత్తి కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో పత్తి కొనుగోళ్లపై మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. క్రాప్ బుకింగ్ పూర్తి చేయటంతో పాటు, కౌలు రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. జిన్నింగ్ మిల్లులో ఉన్న వేయింగ్ మిషన్లు, వే బ్రిడ్జిలను లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీ చేయాలని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయం చేసుకొని, కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలన్నారు.
మహిళల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
మహిళల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. సెప్టెంబర్ 17 నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యే స్వస్థ నారీ స్వశక్తి కార్యక్రమం అమలుపై కలెక్టరేట్లో అధికారులతో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. మహిళా ఆరోగ్యం, పోషకాహారం, కుటుంబంలో మహిళల పాత్ర తదితర అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
యోగా విజేతలకు అభినందన
ఇటీవల నిర్మల్‌లో నిర్వహించిన 6వ రాష్ట్రీయ స్థాయి యోగా పోటీల్లో కామారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థులు చాంపియన్‌షిప్ సాధించినందుకు కలెక్టర్ అభినందించారు. కేజీబీవీ విద్యార్థులు 12 గోల్డ్ మెడల్స్, 3 సిల్వర్ మెడల్స్ సాధించారు. జాతీయ స్థాయి పోటీల్లో విజయాన్ని సాధించాలన్నారు. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్, యూత్ వెల్ఫేర్ అధికారి రంగా వెంకటేశ్వర్ గౌడ్, యోగా అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ రామ్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రఘుకుమార్ పాల్గొన్నారు.
కాజ్వేను పరిశీలించిన కలెక్టర్
లింగంపేట : ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మోతె గుర్జాల్ ఆర్అండ్బీ రహదారిలో వండ్రికల్ గ్రామ సమీపంలో ని కాజ్వేను మంగళవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. గతనెలలో కురిసిన భారీ వర్షాలకు కాజ్వే కొట్టుకుపోయింది. దీంతో మోతె గాంధారి రూట్లో రాకపోకలు నిలిచాయి. రూ.60 వేల వ్యయంతో కాజ్వే మరమ్మతు పనులు చేపట్టి రాకపోకలు పునరుద్ధరించారు. కాజ్వే శాశ్వత పనుల కోసం రూ.6లక్షల వ్యయం అంచనాలు రూపొందించినట్లు తెలిపారు. ఆర్అండ్బీ ఈఈ మోహన్ ఉన్నారు.