కామారెడ్డిటౌన్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన ప్రతి ఒక్కరూ ఇండ్ల నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. మంగళవారం కామారెడ్డి మండలంలోని శబ్ధిపూర్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక, మొరం ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్థికంగా వెనుకబడిన లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా బ్యాంకు లోన్లు ఇప్పించాలన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఎప్పటికప్పుడు ధాన్యాన్ని తూకం వేసి, రైస్ మిల్లులకు తరలించాలన్నారు. గన్నీబ్యాగులు, హమాలీలు, రవాణాకు లారీల కొరత లేకుండా చూడాలన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు.
కళాభారతి ఆడిటోరియంలో...
జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో మంగళవారం జరిగిన నషాముక్త్ భారత్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాదక ద్రవ్యాల నివారణపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి మాట్లాడారు. యువత, విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసలు కావద్దని, బాగా చదివి ఉన్నతంగా ఎదగాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, జిల్లా హౌజింగ్ అధికారి విజయ్ పాల్‌రెడ్డి, డీఆర్డీవో సురేందర్, డీఎస్వో వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా సెక్రెటరీ, జడ్జి నాగరాణి, ఏఎస్పీ చైతన్యారెడ్డి, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి ప్రమీల, జిల్లా ఎక్సైజ్ అధికారి హనుమంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఇండ్ల నిర్మాణాలపై రివ్యూ
కామారెడ్డి : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై కలెక్టరేట్లో మాచారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట ఎంపీడీవోలు, అధికారులతో కలెక్టర్ రివ్యూ నిర్వహించి మాట్లాడారు. ప్రతి రోజు 3 మండలాలపై రివ్యూ చేస్తానన్నారు. నిర్మాణాలు కంప్లీట్ అయ్యేలా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. అడిషనల్ కలెక్టర్ మదన్మోహన్, జడ్సీ సీఈవో చందర్ నాయక్, పీడీ విజయ్‌పాల్‌రెడ్డి, డీఆర్డీవో సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి సెంటర్లకు పత్తి తీసుకురావాలి ..
సీసీఐ సెంటర్లకు బుధవారం నుంచి పత్తిని తీసుకురావాలని కలెక్టర్ రైతులకు సూచించారు. జిన్నింగ్ మిల్లు యజమానులు నిరవధిక బంద్‌ను విరమించారని తెలిపారు. పత్తి కొనుగోలుకు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలని, దిగుబడులను ఏఈవో వద్ద నమోదు చేయించాలన్నారు.
