సూర్యాపేట/ కోదాడ, వెలుగు: సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో నకిలీ కుల సర్టిఫికెట్ల వ్యవహారం బయటపడింది. కొమ్మిబండా తండాకు చెందిన నూనావత్ నరేశ్ భార్య రాజ్యలక్ష్మి బీసీ కులానికి చెందిన మహిళ కాగా, ఎస్టీ సర్టిఫికెట్ జారీ చేశారు. కులాంతర వివాహం చేసుకుందని ఈ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. దీంతో ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయగా ఆర్డీవో విచారణ చేసి కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు.
దీంతో కలెక్టర్ నకిలీ ఎస్టీ సర్టిఫికెట్‌ను రద్దు చేశారు. ఈ సర్టిఫికెట్ ఆధారంగా ఆమె ఎస్టీ మహిళకు రిజర్వ్ అయిన సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేయడంతో వివాదం తలెత్తింది. మరో గ్రామం కొండాపురంలో ముదిరాజ్ వర్గాలకు ఎస్సీ సర్టిఫికెట్లు, ఇతరులకు ఎస్టీ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు సమాచారం. కొన్ని కేసుల్లో ఆధార్ కార్డుల్లో ఇంటి పేర్లు మార్పు చేసి కుల సర్టిఫికెట్లను తయారు చేసిన ఉదంతాలు నమోదయ్యాయి. ఈ మొత్తం వ్యవహారం కలెక్టర్ దృష్టికి చేరడంతో ఆయన పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.

