
- ముంపు నివారణ చర్యలపై సమీక్ష
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలోని వరద ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌష్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ బుధవారం పరిశీలించారు. భారీ వర్షం కురిసినప్పుడు ముంపునకు గురవుతున్న జగిత్యాల రోడ్డు, వన్ టౌన్ ఏరియా, ప్రధాన నాలాలు ప్రవహించే ప్రాంతాలను పరిశీలించారు. వరద నీరు త్వరగా వెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నగరంలో తరచూ ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లో పకడ్బందీగా డ్రైనేజీల నిర్మాణం, నాలాల ఎత్తు పెంచడం, అసంపూర్తిగా ఉన్న కల్వర్టులను నిర్మించడం తదితర అంశాలపై చర్చించారు.
జగిత్యాల రోడ్డులో మంజూరైన ప్రధాన నాలా నిర్మాణాన్ని ప్రారంభించాలని, వన్ టౌన్ వద్ద గల నాలా పునర్నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలన్నారు. అనంతరం కరీంనగర్ మున్సిపల్ ఆఫీస్‌లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు. సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించారు. అంతకుముందు నిషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు.
కలెక్టర్లకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు పమేలా సత్పతి, సందీప్ కుమార్ ఝాతో బుధవారం ఫోన్ లో మాట్లాడారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన కలెక్టర్లకు ఫోన్ చేసి వర్షాలపై ఆరాతీశారు.
రానున్న మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రజలకు సూచించారు.