రబీ సీఎంఆర్ బియ్యం  29లోపు ఇయ్యాల్సిందే.. యాజమాన్యంపై కేసు నమోదు

రబీ సీఎంఆర్ బియ్యం  29లోపు ఇయ్యాల్సిందే.. యాజమాన్యంపై కేసు నమోదు
  • లేకుంటే చర్యలు తప్పవు
  • రైస్ మిల్లుల తనిఖీ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ దాసరి వేణు
  • ఓ మిల్లులో 36 వేల వడ్ల బస్తాలు మాయం

ఆసిఫాబాద్/ కాగజ్ నగర్, వెలుగు: రైస్ మిల్లర్లకు కేటాయించిన సీఎంఆర్ బియ్యం కోటాను ఈనెల 29 లోపు ప్రభుత్వానికి ఇవ్వాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆసిఫాబాద్​జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) దాసరి వేణు హెచ్చరించారు. బుధవారం సిర్పూర్ టీ మండలం వేంపల్లిలోని పలు రైస్ మిల్లుల్లో ఎన్​ఫోర్స్​మెంట్​అధికారులతో కలిసి తనిఖీలు చేశారు.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2022-–23 ఏడాది రబీ సీజన్ బియ్యాన్ని ఈనెల 29లోపు రైస్ మిల్లర్లంతా తిరిగి ఇవ్వాలని ఆదేశించారు. ఈ విషయంపై ఇప్పటికే రైస్ మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. రైతుల నుంచి సేకరించిన వడ్ల నిల్వలు రికార్డుల ప్రకారం ఉండాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జిల్లాలో 559 ఏసీకేల (290 క్వింటాళ్లకు ఒక ఏసీకే) బియ్యం టార్గెట్ ఉండగా.. ఇంకా మిల్లర్ల నుంచి 539 ఏసీకేల బియ్యం రావాల్సి ఉందని చెప్పారు. ఆయనతో పాటు సిర్పూర్ టీ తహసీల్దార్ శ్రీనివాస్, ఎన్​ఫోర్స్​మెంట్ డిప్యూటీ తహసీల్దార్లు శ్యామ్ లాల్, శ్రీనివాస్, రాజ్ కుమార్, రెవెన్యూ ఇన్​స్పెక్టర్ ముబీన్ , రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు చిలువేరు సత్యనారాయణ ఉన్నారు.

38 వేల బస్తాలకు బదులు ఆ మిల్లులో 2 వేల బస్తాలే..

రైస్​ మిల్లర్ల చేతివాటం ఈ తనిఖీల్లో బట్టబయలవుతున్నాయి. స్థానిక లక్ష్మీ నరసింహ రైస్ మిల్లులో భారీ మొత్తంలో వడ్ల నిల్వలు తేడా ఉన్నట్లు గుర్తించినట్లు అడిషనల్​ కలెక్టర్​ పేర్కొన్నారు. వీటికి సంబంధించి తహసీల్దార్, ఎన్​ఫోర్స్​మెంట్ అధికారుల నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. సదరు రైస్ మిల్లులో అధికారులు తనిఖీ చేయగా ఉండాల్సిన స్టాక్​లో ఏకంగా 36 వేల బస్తాల ధాన్యం శార్టేజ్ అయినట్లు గుర్తించారు. మొత్తం 38 వేల వరి బస్తాలు ఉండాల్సి ఉండగా.. కేవలం 2 వేల బస్తాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు.

దీంతో సదరు రైస్ మిల్లుపై 6ఏ కేసు నమోదు చేసినట్లు సిర్పూర్ టీ తహసీల్దార్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ రైస్ మిల్లుకు 35 ఏసీకేల బియ్యం టార్గెట్ ఇవ్వగా ఇప్పటివరకు ఒక్క క్వింటాల్ కూడా ప్రభుత్వానికి తిరిగి ఇవ్వలేదని స్వయానా అడిషనల్ కలెక్టర్ వేణు చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై లోతుగా విచారణ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.