- కలెక్టర్ హైమావతి
సిద్దిపేట రూరల్, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు.
శనివారం సిద్దిపేట కలెక్టరేట్ లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. డిసెంబర్ 14 నుంచి జనవరి 18 వరకు జరిగే బ్రహ్మోత్సావాలకు జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని వారికి తగిన ఏర్పాట్లను చేయాలన్నారు.
మేడారానికి వెళ్లే భక్తులు కూడా మల్లన్న దర్శనానికి వచ్చే అవకాశం ఉన్నందున భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి మానిటరింగ్ చేయాలని, పార్కింగ్, బారికేడ్లు ఏర్పాట్లు చేసి భక్తుల రద్దీని కంట్రోల్ చేయాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం బయోమెడికల్ వెస్ట్ మేనేజ్మెంట్పై జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ఆయా శాఖల అధికారులకు పలు ఆదేశాలు, సూచనలను జారీ చేశారు.
అనంతరం మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్, ఆరోగ్య పరీక్ష కేంద్రాల ద్వారా వెలువడే బయోమెడికల్ వ్యర్థాలను ధర్మా అండ్ కంపెనీ ద్వారా తరలించాలని, వ్యర్థాల తరలింపునకు సంబంధించి హాస్పిటల్స్ పై ధరల భారం పడకుండా స్పష్టమైన మార్గదర్శకాల కోసం నివేదికను పంపించాలన్నారు.
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, అడిషనల్ డీసీపీ కుశాల్కర్, ఏసీబీ సదానందం, ఆలయ ఈవో వెంకటేశ్వర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసమూర్తి, డీఎంహెచ్వో ధన్ రాజ్, డీపీవో విజయ్ కుమార్ పాల్గొన్నారు.
