- నంగునూరు కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్‌లో కలెక్టర్ హైమావతి
సిద్దిపేట రూరల్, వెలుగు: నంగునూరు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కామన్ డైట్ మెనూను తప్పనిసరిగా పాటించాలని, కూరగాయలు దొరకవన్న సాకులు చెబితే ఉపేక్షించేది లేదని వంట సిబ్బందిని హెచ్చరించారు.
మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేసి, పప్పులో ఆకుకూరలు వేసి రుచికరంగా వండాలని సూచించారు. బాలికలకు స్వయంగా నెయ్యి వడ్డించారు. రిజిస్టర్ నిర్వహణలో జాప్యం చేయవద్దని, విధుల్లో నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్, సిబ్బందిని హెచ్చరించారు.
అనంతరం నర్మేట గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, ట్యాబ్ ఎంట్రీలో జాప్యం చేయరాదని సివిల్ సప్లై డీఎం ప్రవీణ్‌కు ఆదేశాలు ఇచ్చారు. అదే గ్రామంలో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించేందుకు ఏర్పాట్లు వేగవంతం చేయాలని సూచించారు.
ఫ్యాక్టరీలో బీటీ రోడ్లు, డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఏన్సాన్‌పల్లి శివారులో రూ.78 కోట్లతో నిర్మించిన జిల్లా జైలును పరిశీలించి, ప్రారంభోత్సవ ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీఓ సదానందం, వ్యవసాయ, ఉద్యానవన, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
