ప్రతీ విద్యార్థి శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించుకోవాలి : కలెక్టర్ హైమావతి

ప్రతీ విద్యార్థి శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించుకోవాలి : కలెక్టర్ హైమావతి

సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రతీ విద్యార్థి శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి ఇన్ స్పైర్, సైన్స్ ఎగ్జిబిషన్ ను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏపీజే అబ్దుల్ కలాం రచించిన వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదివి, ఉన్నత కలలు కని, వాటి సాకారానికి నిరంతరం కృషి చేయాలని చెప్పారు. 

ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ.. స్టూడెంట్స్ ఎప్పటికప్పుడు అప్​డేట్ కావాలన్నారు. పదోతరగతి ఫలితాల్లో జిల్లా ముందు వరుసలో ఉండేలా టీచర్లు చొరవ చూపాలని సూచించారు. ఈ ఎగ్జిబిషన్​లో  విద్యార్థులు 183 ఇన్​స్పైర్ ప్రాజెక్టులు, 236 బాల వైజ్ఞానిక ప్రాజెక్టులను ప్రదర్శించారు. అనంతరం టీటీసీ భవన్ లో నిర్వహించిన అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాలకు కలెక్టర్ హాజరయ్యారు. వివిధ రంగాలలో ప్రతిభ చూపిన 12 మంది వయోవృద్ధులను సన్మానించారు. డీఈవో శ్రీనివాస్ రెడ్డి, సైన్స్ ఆఫీసర్ శ్రీనివాస్, ఆర్టీఏ మెంబర్ సూర్యవర్మ తదితరులు పాల్గొన్నారు.

చీరల పంపిణీ పారదర్శకంగా జరగాలి

జిల్లాలో ఇందిరమ్మ చీరల పంపిణీ పారదర్శకంగా జరిగేలా చూడాలని కలెక్టర్​హైమావతి ఆదేశించారు. బుధవారం ఆమె కలెక్టరేట్ లో మహిళా సమాఖ్య ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎలాంటి విమర్శలు, పొరపాట్లకు తావులేకుండా అర్హులైన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీర అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అడిషనల్​కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్డీవో జయదేవ్ ఆర్య, డీపీవో వినోద్ కుమార్, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు రేణుక తదితరులున్నారు.

సైన్స్ ఫెయిర్ కు స్పందన

నారాయణ్ ఖేడ్, వెలుగు: నారాయణఖేడ్ పట్టణంలోని ఈ తక్షిల స్కూల్​లో నిర్వహిస్తున్న డిస్ట్రిక్ట్​సైన్స్ ఫెయిర్ కు రెండోరోజు బుధవారం స్పందన లభించింది. నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల స్టూడెంట్స్ వివిధ రకాల ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సైన్స్ ఫెయిర్ నిర్వాహకులతో కలిసి అన్ని ఎగ్జిబిట్ల గురించి తెలుసుకున్నారు. సైన్స్ సబ్జెక్టుపై మక్కువ పెంచుకుంటే అద్భుతమైన ఆవిష్కరణలు చేయవచ్చని చెప్పారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. షెట్కర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్​పర్సన్ శివాని, ఎంఈవోలు, టీచర్లు పాల్గొన్నారు.