
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : టెన్త్లో వంద శాతం ఉత్తీర్ణత కోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ విద్యాధికారులకు సూచించారు. కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన హెచ్ఎంల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లోని స్వయం సహాయక బృందాల సాయంతో పిల్లలకు వివిధ పాఠ్యాంశాలలో సందేహాలను నివృత్తి చేసేందుకు ట్యూషన్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలను రూపొందించాలన్నారు.
నాణ్యమైన భోజనం అందించే బాధ్యత హెచ్‌ఎంలదేనని స్పష్టం చేశారు. స్టూడెంట్స్‌లో సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో డీఈఓ నాగలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అకాడమిక్ కో ఆర్డినేటర్ ఎ. నాగరాజశేఖర్, కో ఆర్డినేటర్లు ఎస్కె. సైదులు, ఎన్.సతీశ్‌కుమార్, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఎస్.మాధవరావు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు పక్కాగా నిర్వహించాలి..
ధాన్యం కొనుగోళ్లు పక్కాగా, పారదర్శకంగా నిర్వహించాలాలని కలెక్టర్ జితేశ్ సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ధాన్యం కొనుగోళ్ల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో2,38,177 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేసేందుకు అంచనా వేశామన్నారు. జిల్లాలో 193 సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు చేయనున్నట్టు తెలిపారు. రైతులకు టోకెన్లు ఇవ్వాలన్నారు. గన్నీ బ్యాగులు ఆన్లైన్లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ఇవ్వాలని సూచించారు.
పొరుగు జిల్లాల నుంచి ధాన్యం జిల్లాకు రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే ఇన్చార్జీలు, మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ డి. వేణుగోపాల్, పౌర సరఫరాల శాఖాధికారి రుక్మిణి, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ త్రినాథ్ బాబు, డీసీఓ శ్రీనివాస్, డీఏఓ బాబూరావు, ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్ వెంకటరమణ, తూనికలు కొలతల అధికారి మనోహర్ పాల్గొన్నారు.
మానవ అక్రమ రవాణాను నిర్మూలించాలి..
మానవ అక్రమ రవాణాను నిర్మూలించడాన్ని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతకు తీసుకోవాలని కలెక్టర్ జితేశ్ పేర్కొన్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి సంస్థ, ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు. మానవ అక్రమ రవాణా పేర ఎంతో మంది అమ్మాయిలు, మహిళల జీవితాలు నాశనం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎంఓ నాగరాజు, ప్రజ్వల కో ఆర్డినేటర్ శ్రావ్య శృతి, అసిస్టెంట్ కో ఆర్డినేటర్ చెన్నకేశవులు పాల్గొన్నారు.