టేకులపల్లి మండలంలో తుపాను వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కలెక్టర్

 టేకులపల్లి మండలంలో తుపాను వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కలెక్టర్

టేకులపల్లి, వెలుగు: టేకులపల్లి మండలంలోని తంగెళ్లతండాలో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వరి, పత్తి పంటలను గురువారం భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్​ వి పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొలంలో నీరు నిల్వ ఉండటం వల్ల పంట మరింత నష్టానికి గురయ్యే అవకాశం  ఉందని,  నీటిని తొలగించి, వరి కోతను త్వరగా చేపట్టాలని రైతులకు సూచించారు. పత్తి సాగు చేస్తున్న రైతులు పత్తి అనంతరం మునగ సాగు వైపు దృష్టి సారించాలని సూచించారు. 

మునగ సాగు చేయడం ద్వారా ఇప్పటికే జిల్లాలో చాలామంది రైతులు అధిక లాభాలను ఆర్జిస్తున్నారని, వారిని ఆదర్శంగా తీసుకొని మునగ సాగు ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలని సూచించారు. వరి సాగు చేసే రైతులు, ముఖ్యంగా బోరు సౌకర్యం ఉన్న వారు, సగం భూమిలో ఆయిల్ పామ్ సాగు చేయడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చన్నారు. వ్యవసాయం పట్ల సృజనాత్మక దృష్టితో ముందుకు సాగుతూ, పంటలతో పాటు కౌజు పిట్టల, మేకల, గేదెల, చేపల పెంపకం, కూరగాయల సాగు వంటి అనుబంధ జీవనోపాధులను అభివృద్ధి చేసుకోవడం ద్వారా రైతుల ఆదాయం విస్తృతమవుతుందని తెలిపారు. 

ఈ విధానం ద్వారా వ్యవసాయం స్థిరంగా నిలవడమే కాకుండా రైతుల ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుందని ఆయన వివరించారు. పంట రక్షణకు తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించడంతో పాటు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు  జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని, ప్రతీ రైతు సమస్యకు త్వరగా పరిష్కారం కల్పించేందుకు కట్టుబడి ఉందన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, ఇల్లెందు ఏడీఏ లాల్ చంద్, మండల వ్యవసాయశాఖ అధికారి అన్నపూర్ణ, ఏఈఓ రమేశ్, సంబంధిత శాఖల అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు