పినపాక, వెలుగు: ఎన్యూమరేటర్లు ట్రైనింగ్లో నేర్చుకున్న అంశాలను ఫీల్డ్లో అమలు చేస్తూ సెన్సస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. జనగణన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు మండలంలోని రైతువేదికలో మూడు రోజులపాటు నిర్వహించనున్న ట్రైనింగ్ ను ఆయన ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగణన కోసం పినపాక మండలంలోని ఏడు రెవెన్యూ విలేజ్లను పైలట్ ప్రాజెక్ట్ కింద కేంద్రం ఎంపిక చేసిన నేపథ్యంలో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. డిజిటల్పద్ధతిలో వివరాలు సేకరించాల్సి ఉన్నందున్న ఎన్యూమరేటర్లు సంబంధిత సమాచారాన్ని ఎటువంటి పొరపాట్లకు తావీయకుండా నమోదు చేయాలని చెప్పారు. ఈ వివరాల సేకరణ జనగణన కోసం మాత్రమేనని, వీటితో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యకరమంలో తహసీల్దార్, జనగణన పైలట్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు పటిష్ట ఏర్పాట్లు
భద్రాద్రికొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్లబయ్యారం జడ్పీ స్కూల్లో ఈ నెల 8నుంచి మూడురోజుల పాటు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి బాలబాలికల అండర్-17 కబడ్డీ పోటీల ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని కలెక్టర్ జితేశ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం మండలంలో పర్యటించిన ఆయన కబడ్డీ పోటీల ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఎంపీవో వెంకటేశ్వర్లు, ట్రాన్స్కో ఏఈ వేణుగోపాల్, కంది ఫౌండేషన్ చైర్మన్ కంది సుబ్బారెడ్డి, పీడీ బి.వీరన్న, తదితరులు పాల్గొన్నారు.
