- ముక్కోటి ఏర్పాట్ల రివ్యూ మీటింగ్‌లో కలెక్టర్ ఆదేశాలు
భద్రాచలం, వెలుగు : ఆఫీసర్లంతా కలిసి అంకితభావంతో పనిచేసి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించే ముక్కోటి ఏకాదశి ఉత్సవాల ఏర్పాట్లపై ఆఫీసర్లతో గురువారం సబ్ కలెక్టర్ ఆఫీసులో రివ్యూ మీ చేశారు. అన్నిశాఖల ఆఫీసర్లకు నిర్ధేశించిన పనులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సకాలంలో పూర్తి చేయాలన్నారు.
ఉత్సవాల ఏర్పాట్లను దేవస్థానం, రెవెన్యూ, పోలీసు ఆఫీసర్లు పర్యవేక్షించాలని సూచించారు. తెప్పోత్సవం, ఉత్తరద్వార దర్శనం బందోబస్తు పోలీసులు చేపట్టాలన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా నామమాత్రపు ధరలతో సౌకర్యాలు కల్పించేలా లాడ్జీ, హోటళ్లు యజమానులతో సమావేశం నిర్వహించి ధరలు నిర్ణయించాలని సబ్ కలెక్టర్‌కు సూచించారు.
ఆలయ పరిసరాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భద్రాచలం, పర్ణశాలల్లో దేవాలయాలకు లైటింగ్ పెట్టాలన్నారు. ఉత్సవాలు తిలకించేలా ఎల్ఈడీ స్క్రీన్లు పెట్టాలని చెప్పారు. హంసావాహనం తనిఖీ చేసి రిపోర్టు ఇవ్వాలని ఇరిగేషన్ ఈఈని ఆదేశించారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని, గజ ఈతగాళ్లను నియమించాలన్నారు. తెప్పోత్సవం వేళ గోదావరిలో హంసావాహనంపై పరిమిత సంఖ్యలోనే ఆఫీసర్లను అనుమతించాలని చెప్పారు.
పట్టణంలో హోటళ్లలో ఆహార నాణ్యతను తనిఖీ చేయాలని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, తూనికలు కొలతల శాఖల ఆఫీసర్లను ఆదేశించారు. శానిటేషన్ విషయంలో అలర్ట్‌గా ఉండాలన్నారు. పర్ణశాలలో స్పెషల్ టీంలను నియమించాలని ఆదేశించారు. సెక్టార్లుగా విభజించి ఆఫీసర్లను పెట్టాలన్నారు. తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచించారు.
ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. బస్సులు,రైలులు వచ్చే సమయాలను చార్టులు పెట్టాలని చెప్పారు. వాహనాల కోసం పార్కింగ్ ప్లేస్‌లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. టాయిలెట్లు వివిధ ప్రాంతాల్లో కట్టాలన్నారు. ఈ ఏడాది కూడా ఏరు ఉత్సవాలను నిర్వహిస్తామని చెప్పారు. బొజ్జిగుప్ప(దుమ్ముగూడెం), బెండాలపాడు(ములకలపల్లి), రథంగుట్ట, పగిడేరు(మణుగూరు) ప్రాంతాలను దర్శించేలా ఏర్పాట్లు చేయాలని ఆఫీసర్లకు సూచించారు.
గిరిజన సంప్రదాయ వంటలతో ప్రత్యేకమైన స్టాళ్లను గోదావరి కరకట్టపై పెట్టాలన్నారు. తెప్పోత్సవం, ఉత్తరద్వారదర్శనం రెండు రోజులు భద్రాచలంలో మద్యం అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించారు. ఐటీసీ సహకారంతో గ్రామపంచాయతీ గోదావరి బ్రిడ్జిపై స్ట్రీట్‌లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్లాస్టిక్ వాడకంపై నిషేధించాలని, భక్తులకు అవగాహన కల్పించాలని సూచించారు.
గోదావరి బోట్లలో లైఫ్ జాకెట్లు, రక్షణ ఏర్పాట్లు చూడాలన్నారు. సమాచార కేంద్రాల ద్వారా భక్తులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, అడిషనల్ కలెక్టర్ విద్యాచందన, దేవస్థానం ఈవో దామోదర్‌రావు, కొత్తగూడెం ఆర్డీవో మధు, పాల్వంచ డీఎస్పీ సతీశ్‌కుమార్ పాల్గొన్నారు.
