భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సర్దార్ వల్లభాయ్‌పటేల్ స్ఫూర్తితో యువత దేశ సమగ్రత, అభివృద్ధి దిశగా కృషి చేయాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్వి పాటిల్ సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సర్దార్@150 ఐక్యత పాదయాత్ర ప్రోగ్రామ్స్‌ను ఆయన వివరించారు. దేశ సమగ్రత, ప్రజాస్వామ్య విలువలు, దేశభక్తి భావనలు బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
వ్యాసరచన, సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. జిల్లాలో ఈ నెల 1 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ఐక్యత పాదయాత్రలు, ఆరోగ్య శిబిరాలు, వల్లభాయ్ పటేల్ జీవితంపై ప్రసంగాలు, ఆత్మనిర్బర్ భారత్ ప్రతిజ్ఞలు, సర్టిఫికెట్ ప్రదానం లాంటి ప్రోగ్రామ్స్ చేపట్టనున్నట్టు వివరించారు. విత్తన కార్యక్రమంలో భాగంగా అశ్వాపురం ఎంపీపీ స్కూల్ స్టూడెంట్స్ 40 రకాల 400 కిలోల విత్తానలను సేకరించడం అభినందనీయమన్నారు.
హైదరాబాద్‌లోని ఎన్ఎస్టీ సంస్థ ద్వారా ఫర్నీచర్ తయరీ రంగంలో మూడు నెలల పాటు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఎనిమిది మంది రూ. 15వేల వేతనంతో ఆర్నెళ్ల పాటు అప్రెంటీస్ షిప్ పొందుతున్నారని చెప్పారు. ఈ నెల 6 నుంచి రెండో విడత ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుందన్నారు. 18ఏండ్ల నుంచి 30ఏండ్ల వయసు గల నిరుద్యోగ గిరిజన యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఎస్ఐఆర్ సన్నాహక ప్రక్రియను పూర్తిచేయాలి
జిల్లాలో ప్రత్యేక ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్ఐఆర్ ) సన్నాహక ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకనుగుణంగా నిర్ధిష్ట గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
2002 సంవత్సరపు ఓటర్ల జాబితాను 2025 సంవత్సరం జాబితాతో మ్యాపింగ్ చేసి నాలుగు కేటగిరీలుగా విభజించినట్టు తెలిపారు. ప్రజా పాలన, రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన సాదా బైనామాలు, అసైన్డ్ భూముల పెండింగ్ దరఖాస్తులను ఈ నెల 3 లోపు పరిష్కరించాలన్నారు. తిరస్కరించిన దరఖాస్తులపై కారణాలను స్పష్టంగా నమోదు చేయాలని ఆదేశించారు.
