
కోహెడ (హుస్నాబాద్), వెలుగు: సేంద్రియ వ్యవసాయంపై రైతులు దృష్టి పెట్టాలని కలెక్టర్మనుచౌదరి సూచించారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ లో మూడు రోజులుగా జరుగుతున్న రైతు మహోత్సవం ఆదివారం ముగిసింది. కార్యక్రమానికి కలెక్టర్ మను చౌదరి హాజరై మాట్లాడారు. సిద్దిపేట జిల్లాతో పాటు కరీంనగర్, జనగాం, హన్మకొండ జిల్లాల నుంచి వచ్చిన రైతులు 3 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వ్యవసాయంలో నూతన టెక్నాలజీ, వివిధ మార్పులు గురించి తెలుసుకున్నారన్నారు. మహారాష్ట్ర రైతాంగం అరటి సాగుకు 1980–85 లో డ్రిప్ ను ఉపయోగించేవారని తెలిపారు. వాతావరణం అనుగుణంగా మార్పు చేస్తే లాభాలు పొందవచ్చనే విషయాన్ని వారు నిరూపించారన్నారు.
కామారెడ్డి జిల్లాలో ఓ రైతు ఎకరం భూమిలో 30 గుంటల వరి,10 గుంటల్లో చేపల పెంపకం, కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచాడన్నారు. ఆవులకు ఒక షెడ్ వేసి వాటి పేడ, మూత్రం ట్యాంక్ లో నింపి మొక్క వేర్ల దగ్గర పిచికారీ చేసేవాడన్నారు. ఇలా చేయడం వల్ల అతడు అధిక లాభాలు సాధించాడని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స శాఖ, బ్యాంకింగ్, ఇతర ప్రైవేట్ రంగాల ప్రతినిధులు భాగస్వామ్యం అయినందుకు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ ద్వారా రైతులకు సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, సింగిల్విండో చైర్మన్ శివ్వయ్య, ఏఎంసీ చైర్మన్తిరుపతిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.