నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ జిల్లాలో పైలెట్ పద్ధతిలో ఎంపిక చేసిన గ్రామాల్లో గృహజ్యోతి లబ్ధిదారులకు అమలు చేస్తున్న ‘రూఫ్ టాప్ సోలార్ సిస్టం’ పనులను మార్చి మొదటి వారంలోపు పూర్తి చేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. బుధవారం ఆయన రాష్ట్రంలోని నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో టీఎస్ రెడ్‌కో ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను పరిశీలించారు.
కనగల్ గ్రామంలో 292 మంది గృహ జ్యోతి లబ్ధిదారులను పైలెట్ ప్రాజెక్టుకు ఎంపిక చేసి రెండు కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 77 ఇళ్లపై సిస్టంల అమరిక ప్రారంభమైందన్నారు. మిగిలిన ఇళ్లలో సర్వే పూర్తి చేసి వెంటనే పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని అనుముల మండలం, దేవరకొండ మండలం ముదిగొండ గ్రామాలు కూడా ఈ పైలెట్ ప్రాజెక్టుకు ఎంపికయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా 81 గ్రామాల్లో అమలు కానున్న ఈ పథకంలో నల్గొండ జిల్లాకు మూడు గ్రామాలు ఎంపిక కావడం విశేషం. ప్రతి ఇంటిపై ఏర్పాటు చేసే రెండు కిలోవాట్ల సోలార్ సిస్టం ద్వారా సుమారు 240 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. లబ్ధిదారులు 200 యూనిట్లలోపు వినియోగించుకుని మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్నారు. ఇక్కడ విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. రెడ్‌కో జిల్లా మేనేజర్ సంతోష్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
