జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: జిల్లాలోని కాళేశ్వర క్షేత్రంలో ఈనెల 21నుంచి నిర్వహించే సరస్వతి అంత్యపుష్కరాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆఫీసర్లను ఆదేశించారు. పనుల పురోగతిపై మంగళవారం రివ్యూ చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు చలువ పందిళ్లు, బట్టలు మార్చు గదులు, దివ్యాంగుల కొరకు బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హెలిప్యాడ్ నుంచి సరస్వతి ఘాట్ వరకు బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు.
నదిలోకి వెళ్లడానికి తాత్కాలిక రహదారి, క్వయర్ మ్యాట్స్ వేయాలని చెప్పారు. తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీరు సరఫరా, ఇతర వసతులపై పలు సూచనలు చేశారు. సమావేశంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, వివిధ శాఖల ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
