
కరీంనగర్, వెలుగు: బాలసదనంలో ఉన్న పిల్లలను చట్ట ప్రకారమే దత్తత తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. అమెరికాకు చెందిన దంపతులు బాలసదనంలోని ఐదేళ్లలోపు చిన్నారిని దత్తత తీసుకునేందుకు అప్లై చేసుకోగా.. వారిని మంగళవారం వెబినార్‌లో ఇంటర్వ్యూ చేశారు. వారి ఆర్థిక, వృత్తి, కుటుంబ నేపథ్యం అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి చిన్నారిని చూపించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విదేశాల నుంచి సైతం ప్రత్యేక అవసరాలున్న పిల్లలను దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ఈ దత్తతకు సంబంధించి కలెక్టర్ తన నివేదికను దౌత్య కార్యాలయానికి పంపనున్నారు. అనంతరం మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్, హైదరాబాద్, తమిళనాడుకు చెందిన దంపతులు కరీంనగర్ శిశు గృహ నుంచి పిల్లలను గతంలో దత్తత తీసుకున్నారు. వారికి మంగళవారం దత్తత ఉత్తర్వులు అందజేశారు.
చేప పిల్లల ఉత్పత్తి ప్రక్రియను, ఉత్పత్తి దశలను జీవశాస్త్రం చదివే విద్యార్థులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో మానేరు జలాశయం సమీపంలో నిర్వహిస్తున్న చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఆమె వెంట మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విజయభారతి
వివరించారు.
బధిర విద్యార్థులకు కుట్టు మిషన్, కంప్యూటర్ శిక్షణ
కరీంనగర్ టౌన్, వెలుగు: బధిర విద్యార్థులు విభిన్న రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో కుట్టు మిషన్, కంప్యూటర్ రంగంలో శిక్షణ ఇస్తున్నట్లు కలెక్టర్ పమేలాసత్పతి తెలిపారు. సిటీలోని బధిరుల స్కూల్‌ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిక్షణ కోసం ప్రస్తుతం ముగ్గురు ఒకేషనల్ టీచర్లను కేటాయించామని తెలిపారు. బధిర విద్యార్థులతో సంభాషించే విధంగా 100 మందికి సైన్ లాంగ్వేజీలో శిక్షణ ఇస్తామన్నారు. అనంతరం క్లాస్ రూమ్‌లను సందర్శించి వారి నోట్ పుస్తకాలను, చేతి రాతను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో డీడబ్ల్యూవో సరస్వతి, జిల్లా బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి, జిల్లా సైన్స్ ఆఫీసర్జైపాల్రెడ్డి, డీసీపీవో పర్వీన్, పీవోఎన్ఐసీ తిరుపతి, శిశు గృహ మేనేజర్ తేజస్వి, ప్రిన్సిపాల్ కమల, తదితరులు పాల్గొన్నారు.