ఎంపీడీవోలు పనుల్ని పర్యవేక్షించాలి : కలెక్టర్ పమేలా సత్పతి

ఎంపీడీవోలు పనుల్ని పర్యవేక్షించాలి : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్​, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ భవనాల నిర్మాణం, మరమ్మతులు వంటి అభివృద్ధి పనులపై ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో సందర్శించి త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్​ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో వివిధ పథకాల ద్వారా మంజూరైన నిధులతో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాలు త్వరితగతిన  పూర్తిచేసేలా చూడాలన్నారు. 

ఇందిరమ్మ ఇల్లు కోసం వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుని అర్హులైన లబ్ధిదారులు ఉంటే తదుపరి జాబితాలో చోటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రైవేట్ అంబులెన్స్​లను ప్రభుత్వ ఆసుపత్రికి అతి సమీపంలో నిలుపుతున్నారని వాటిని అక్కడకు రాకుండా కట్టడి చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, ఏవో సుధాకర్ పాల్గొన్నారు.

ప్రజావాణికి 339 దరఖాస్తులు 

ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 339 అర్జీలు పరిష్కారం కోసం రాగా వాటిని వివిధ శాఖల అధికారులకు బదిలీ చేశారు. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.