- కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో వివిధ పథకాల లక్ష్యసాధనకు రుణాలందించడంలో బ్యాంకర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ఆర్థిక మద్దతు పథకాలకు సంబంధించి 100 శాతం లక్ష్యసాధనకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో బ్యాంకర్లు, జిల్లా అధికారులతో రైతులకు రుణాల పంపిణీ, స్వయం సహాయక సంఘాల రుణాలు, రికవరీ, పీఎంజీపీవై రుణాలు, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల పథకాలకు సంబంధించి రుణ లక్ష్య పురోగతిపై డీసీసీ, డీఎల్ఆర్ సీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూరైతులు తమ రుణాలను రెన్యూవల్ చేసుకునే అంశంపై వారికి అవగాహన కల్పించాలని సూచించారు.
2025–-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రూ.7821.19 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. అర్హులైన రైతులు అందరికీ రుణాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఎల్డిఎం ఆంజనేయులు, జడ్పీ సీఈవో శ్రీనివాస్, డీఆర్డీవో శ్రీధర్, ఆర్బీఐ అధికారి శ్రీనివాస్, నాబార్డ్ డీడీఎం జయప్రకాశ్, ఎస్బీఐ ఏజీఎం వెంకటేశ్
పాల్గొన్నారు.
సిరిసిల్లలో డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్
రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లాలోని అన్ని బ్యాంకులు ప్రభుత్వ లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వాలని డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ చైర్మన్, ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని బ్యాంకులు తమకు కేటాయించిన లక్ష్యాలు చేరుకోవాలని సూచించారు. వ్యవసాయ, విద్య రుణాలు ప్రస్తుతం 50 శాతం పూర్తయ్యాయని, ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా 100 శాతం పూర్తిచేయాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నిబంధనల ప్రకారం రుణం ఇవ్వాలని ఆదేశించారు. 1930 , 1945 టోల్ ఫ్రీ నంబర్ల గురించి వివరించాలని, పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ, స్వానిధి అమలు, పురోగతి పై సమీక్ష చేశారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ నగేశ్, డీఆర్డీవో శేషాద్రి, ఎల్‌డీఎం మల్లికార్జునరావు, ఆర్బీఐ ఏజీఎం రాములు సహావత్, నాబార్డ్ డీడీఎం దిలీప్, యూబీఐ డీజీఎం అపర్ణ రెడ్డి, ఎస్బీఐ ఏజీఎం వెంకటేశ్, పాల్గొన్నారు.
సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు ఆవరణ శుభ్రంగా ఉండాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని కొత్త చెరువును ఆమె పరిశీలించారు. చెరువు కట్ట పరిసరాలు సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఇక్కడ అవసరమైన యంత్రాలు, సామగ్రిపై ప్రతిపాదనలు పంపాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.
అనంతరం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు వద్ద ఉన్న డంపింగ్ యార్డ్, సిరిసిల్ల రైతుబజార్‌ను విజిట్ చేశారు. ఆమె వెంట సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ స్వరూపారెడ్డి, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీవీహెచ్‌వో రవీందర్ రెడ్డి, డీఏవో అఫ్జల్ బేగం, తహసీల్దార్ మహేశ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా ఉన్నారు.
