
వీణవంక, వెలుగు: విభిన్న రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దుతున్న చల్లూరు జడ్పీ హైస్కూల్ ఆదర్శనీయమని, ఇంగ్లిష్‌లో పట్టు సాధించేందుకు ఇక్కడ ప్రారంభించిన ఇంగ్లీష్ క్లబ్‌ను జిల్లావ్యాప్తంగా అమలు చేస్తామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. వీణవంక మండలం చల్లూర్ జడ్పీ హైస్కూల్‌లో ‘బుధవారం బోధన’ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. విద్యార్థులు స్వయంగా తయారుచేసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, పెయింటింగ్స్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులను అన్ని రంగాల్లోనూ తీర్చిదిద్దేందుకు చల్లూరు హైస్కూల్ ఉపాధ్యాయ బృందం తీసుకున్న చర్యలను అభినందించారు. ఇక్కడి విద్యార్థి ప్రపంచ వేదిక టెడ్ ఎక్స్ కార్యక్రమానికి ఎంపికవడం గర్వకారణమన్నారు. జడ్పీహెచ్ఎస్ చల్లూరు పేరుతో వార్త చానల్ ప్రారంభించడాన్ని అభినందించారు. అనంతరం స్కూల్‌లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంఈవో శోభారాణి, తహసీల్దార్ రజిత, ఎంపీడీవో శ్రీధర్, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్‌రెడ్డి, హెచ్‌ఎం సంపత్ కుమార్ చారి పాల్గొన్నారు.
జమ్మికుంట, వెలుగు: ఆరోగ్య మహిళా ఉచిత వైద్య పరీక్షలు స్పీడప్ చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జమ్మికుంట సీహెచ్‌సీని కలెక్టర్ బుధవారం సందర్శించారు. వార్డులు, ఓపీ విభాగం, ల్యాబ్, మెడికల్ స్టోర్స్, లేబర్ రూమ్స్‌ను సందర్శించారు. వార్డులు పరిశీలించి రోగులతో మాట్లాడారు. ఆస్పత్రి సిబ్బంది వారికి అందిస్తున్న సేవలను గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.కార్యక్రమంలో ఆర్డీవో రమేశ్‌బాబు, డీఎంహెచ్‌వో వెంకటరమణ, సూపరింటెండెంట్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.