ఆడబిడ్డలు ప్రతీ రంగంలో ప్రతిభను చాటాలి : కలెక్టర్ ప్రావీణ్య

ఆడబిడ్డలు ప్రతీ రంగంలో ప్రతిభను చాటాలి :  కలెక్టర్ ప్రావీణ్య
  •   కలెక్టర్​ ప్రావీణ్య

పుల్కల్, వెలుగు: అడ్వెంచర్ క్యాంప్‌లు స్టూడెంట్స్​కు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. గురువారం కేజీబీవీ పుల్కల్, చౌటకూర్ విద్యార్థినులకు సంగారెడ్డి మండలంలోని మంజీరా పర్యాటక కేంద్రంలో నిర్వహించిన అడ్వెంచర్ క్యాంపునకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లడారు.  

జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. ఈ అనుభవాలు మీ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయని సూచించారు. ఆడబిడ్డలు అంకితభావంతో  ప్రతీ రంగంలో ప్రతిభను చాటాలన్నారు. మహిళలు స్వయం ఉపాధి ద్వార ఆర్థికంగా ఎదిగి దేశ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని కోరారు. ట్రైనీ డిప్యూటీ  కలెక్టర్లు దీపిక, ప్రతిభ, ఎంఈవో శంకర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మానసిక, వికలాంగ పిల్లలకు సమాన అవకాశాలు కల్పించాలి

సంగారెడ్డి టౌన్: మానసిక  వికలాంగ పిల్లలు  సమాజంలో అంతర్భాగమే అని వారికి సమాన అవకాశాలు కల్పించడం మనందరి బాధ్యత అని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని హాస్టల్ గడ్డలో ఉన్న సహారా ప్రాథమిక పునరావాస కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. ఇలాంటి సమగ్ర పునరావాస కేంద్రాల దివ్యాంగుల పిల్లలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. పిల్లల కోసం సంస్థ చేపడుతున్న ఫిజియో, స్పీచ్,  బిహేవియర్, ఆక్యుపేషనల్ థెరపీలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. సహారా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రతిమా రెడ్డి, డైరెక్టర్ శంకర్లు  కేంద్రం కార్యకలాపాలను  కలెక్టర్ కు వివరించారు.

 ప్రస్తుతం కేంద్రంలో 50 మందికి పైగా పిల్లలు వివిధ థెరపీలను పొందుతున్నారని తెలిపారు. ఇతర సేవలతో పాటు, సహారా సంస్థ ఒక ఇన్‌క్లూజివ్ ఆస్పత్రిని కూడా నిర్వహిస్తోందన్నారు. వికలాంగుల నైపుణ్యాభివృద్ధి కోసం వృత్తి శిక్షణా కేంద్రం ద్వారా హస్తకళలు, కంప్యూటర్ నైపుణ్యాలు, చిన్న వ్యాపార శిక్షణ వంటి కోర్సులు అందిస్తున్నామన్నారు.