
చిలప్‌చెడ్, వెలుగు: నిరుపేదలకే ఇందరిమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కలెక్టర్‌రాహుల్‌రాజ్ అన్నారు. సోమవారం మండలంలోని గౌతపూర్ మండల పరిషత్ స్కూల్లో జరుగుతున్న రెవెన్యూ సదస్సును తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. మండలంలోని 13 గ్రామాల్లో సదస్సులు పూర్తయినట్లు తెలిపారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దివ్యాంగురాలైన ధరిపల్లి సంతోష ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో తనకు అవకాశం కల్పించాలని కలెక్టర్ కు విన్నవించగా అర్హత మేరకు చర్యలు చేపడతామని చెప్పారు.
ఎస్సీ కాలనీలో నీటి సమస్యపై కలెక్టర్ స్పందిస్తూ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని పంచాయతీ సెక్రటరీని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీవో మహిపాల్ రెడ్డి, తహసీల్దార్లు సహదేవ్, శ్రీనివాసాచారి, డీటీ సింధూజ ఉన్నారు.
మాకు ఇందిరమ్మ ఇళ్లు వద్దు
శివ్వంపేట: మండలంలోని గంగయ్యపల్లికి చెందిన చిన్న దాసరి పోచమ్మ తనకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని రద్దు చేయాలని పంచాయతీ కార్యదర్శిని కోరింది. ప్రజా పాలనలో ఇళ్లు కావాలని దరఖాస్తు చేసుకున్న పోచమ్మకు అధికారులు ఇళ్లు మంజూరు చేశారు. కాగా ప్రభుత్వం పెడుతున్న షరతులు కఠినంగా ఉన్నాయని, 60 గజాల్లో ఇళ్లు నిర్మించుకోవడం సాధ్యం కాదని అందువల్ల తనకు మంజూరైన ఇంటిని రద్దు చేయాలని సోమవారం పంచాయితీ కార్యదర్శి కి వినతి పత్రం అందజేసింది. తన పేరు రద్దు చేసి వేరే వాళ్లకు ఇవ్వాలని కోరింది.