మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్ జిల్లాలో  రోడ్డు ప్రమాదాలను నివారించాలి :  కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, వెలుగు:  జిల్లాలో రోడ్డు ప్రమాదాల వల్ల అమూల్యమైన ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం జరుగుతున్నందున  రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని  కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లో  ఎస్పీ శ్రీనివాస్ రావు, సంబంధిత శాఖ  అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలలో గణనీయమైన తగ్గుదల సాధ్యమని తెలిపారు.

ప్రమాదాలకు ప్రధాన కారణాలు మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్‌‌ఫోన్‌‌లో మాట్లాడుతూ లేదా మెసేజ్‌‌లు టైప్ చేస్తూ డ్రైవింగ్ చేయొద్దని పేర్కొన్నారు.అతివేగం, ఓవర్‌‌టేకింగ్, సిగ్నల్ జంపింగ్, ఓవర్‌‌లోడింగ్, హెల్మెట్/సీట్‌‌బెల్ట్ ఉపయోగించకపోవడం ప్రమాదాలకు కారణమన్నారు.  

 బ్లాక్‌‌స్పాట్లను గుర్తించి   బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, లైటింగ్‌‌ఏర్పాటు చేయడం, రోడ్డు భద్రతా కమిటీల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎస్ పి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ స్కూళ్లు, కాలేజీలలో రోడ్డు భద్రతా క్లబ్‌‌లు, అవగాహన సభల ద్వారా విద్యార్థుల్లో చిన్న వయసులోనే ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా వైద్య అధికారి శ్రీరామ్  పాల్గొన్నారు.