- కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, వెలుగు: మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ స్టూడెంట్స్‌కు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్సూచించారు. మంగళవారం ఆయన స్థానిక ప్రభుత్వ మెడికల్ కాలేజీని, నిర్మాణంలో ఉన్న క్రిటికల్ కేర్ బిల్డింగ్‌ను, మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు.
ముందుగా మెడికల్ కాలేజీలో క్లాస్ రూమ్‌లు, ల్యాబ్‌లు, డెమోరూమ్లు, లైబ్రరీని పరిశీలించారు. ఎంబీబీఎస్ స్టూడెంట్స్సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫస్ట్ ఇయర్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. మెడికల్ విద్యార్థులు ర్యాగింగ్ కు దూరంగా ఉండాలని, చట్టాలు కఠినంగా ఉన్నాయని సూచించారు.
కలెక్టర్ మాట్లాడుతూ వైద్య విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అవసరమైన అన్ని వసతులు సమకూర్చాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. ఈ నెలలోనే ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ తరగతులు ప్రారంభం కావడంతో వారికి హాస్టల్ తో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలన్నారు. మెడికల్ కాలేజీలో ఏవైనా పెండింగ్ పనులుంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
అనంతరం నిర్మాణం చివరి దశలో ఉన్న క్రిటికల్ కేర్ సెంటర్ ను పరిశీంచి, తొందరగా పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మాతా శిశు కేంద్రంలో పెషంట్లతో మాట్లాడి వైద్య సేవలు ఎలా అందుతున్నాయో తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్ఓ శ్రీరామ్, ప్రిన్సిపాల్ నితిన్ కాబ్రా, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్సునీత, డీసీహెచ్ ఎస్ శివ యాల్ ఉన్నారు.
