- కలెక్టర్ రాహుల్ శర్మ
మహదేవపూర్(పలిమెల), వెలుగు : సుడిగాలి వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం లెంకలగడ్డ శివారు ప్రాంతంలో మంగళవారం భారీ సుడిగాలికి పంటలు, అడవిలో చెట్లు కూలిపోయాయి. సుమారు 30 నుంచి 40 ఎకరాల్లో పత్తి, మిర్చి, వరి పంటలు ధ్వంసమయ్యాయి. సుడిగాలి వల్ల దెబ్బతిన్న పంట పొలాలను గురువారం కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు ప్రాథమికంగా పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికలు అందించాలని ఆదేశించారు.
నివేదికను ప్రభుత్వానికి పంపించి రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. మోటార్ సైకిల్ పై ఫారెస్ట్ ఆఫీసర్ లతో కలిసి వెళ్లి నేలకొరిగిన వృక్షాలను పరిశీలించారు. అటవీ ప్రాంతంలో విరిగిన చెట్లను లెక్కించి నివేదిక అందించాలని సూచించారు. నవంబర్ 8 నుంచి 15 జరిగే ఎఫ్ఎస్ఆర్ పీ ప్రోగ్రాంలో భాగంగా ముస్సోరి నుంచి ఐఏఎస్ ల బృందం లెంకలగడ్డకు రానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాల భవనం, వసతి, విద్యుత్, నీరు, పారిశుధ్య కార్యక్రమాలు, భద్రత వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. ఆయన వెంట జిల్లా అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి, ఉద్యానవనశాఖ అధికారి సునీల్, వ్యవసాయశాఖ అధికారి బాబూరావు, తహసీల్దార్ అనిల్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
