మహదేవపూర్, వెలుగు: కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆఫీసర్లను ఆదేశించారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దేవాలయ పరిసరాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
దేవాలయం, అన్నదాన సత్రం, ప్రసాదం కౌంటర్లు, పార్కింగ్ స్థలాలు, గోదావరి ఘాట్ల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఫిబ్రవరి 15న సరస్వతి ఘాట్ వద్ద జరిగే తెప్పోత్సవం సందర్భంగా సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. 15వ తేదీ ఉదయం 4 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు ప్రధాన ఆలయంలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని దేవాలయ ఈవోను ఆదేశించారు. మహదేవ్పూర్, కాటారం, భూపాలపల్లి మార్గంలో ఇసుక వాహనాల రాకపోకలపై నిషేధం విధించాలని తెలిపారు.
