
మెదక్ టౌన్, వెలుగు : మెదక్, హవేళీ ఘనపూర్ మండలాల్లో అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదంలో ఉన్న భూములను జాయింట్‌గా సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ రమేశ్‌తో కలిసి అటవీ, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మెదక్ మండలంలోని ఖాజిపల్లి, బాలానగర్, గుట్టకిందిపల్లి, హవేళీ ఘనపూర్ మండలంలోని బూర్గుపల్లి, బోగడ భూపతిపూర్‌లోని పలు సర్వే నెంబర్లలో రెండు శాఖ మధ్య వివాదం ఉందన్నారు. జాయింట్‌గా సర్వే నిర్వహించి భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా పక్కాగా మార్కింగ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌వో రవిప్రసాద్, ఆర్డీవో సాయిరామ్, జడ్పీ వైస్ చైర్‌పర్సన్ లావణ్య, ఫారెస్ట్ రేంజ్ అధికారి మనోజ్ కుమార్, తహసీల్దార్లు, సర్పంచులు పాల్గొన్నారు.
సీఎం కప్ పోటీలకు పక్కా ఏర్పాట్లు చేయాలి
22 నుంచి 24 వరకు జిల్లా స్థాయిలో నిర్వహించే సీఎం కప్ పోటీలకు పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.
శుక్రవారం తన చాంబర్‌లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ మెదక్ పట్టణంలోని బాలుర జూనియర్ కాలేజీ, ఇందిరా గాంధీ స్టేడియం, పీఎన్ఆర్ స్టేడియాల్లో పోటీలు ఉంటాయన్నారు. మండల స్థాయి పోటీల్లో గెలుపొందిన 953 మందితో పాటు మరో 200 మంది క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు. ఈ నెల 21లోగా ఎంపీడీవోల వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. జడ్పీ సీఈవో వెంకట శైలేశ్, డీఎంహెచ్‌వో డాక్టర్ చందూనాయక్, మైన్స్ ఏడీ జయరాజ్, డీఐవో కృష్ణ మూర్తి, డీఈవో రాధాకిషన్, డీఎస్‌వో రాజి రెడ్డి పాల్గొన్నారు.