
- కలెక్టర్ రాజీవ్‌గాంధీ
నిజామాబాద్, వెలుగు : జిల్లా స్వయం సహాయ సంఘాల్లో సభ్యత్వం ఉన్న 3.40 లక్షల మందిలో నిరక్షరాస్యుల వివరాలు సేకరించి, వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పని చేయాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు కోరారు. సోమవారం కలెక్టరేట్లో 'అక్షరలక్ష్మి' యాప్‌ను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు.
యాప్‌లో నమోదు చేసిన నిరక్షరాస్య మహిళలకు అక్షరాస్యత సెంటర్ వలంటీర్లతో చదువు నేర్పుతామన్నారు. మధ్యలో చదువు మానేసిన వారిని ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాయిస్తామన్నారు. జిల్లాలో 55 శాతం ఉన్న మహిళా అక్షరాస్యత వంద శాతం చేరేలా కృషి చేయాలన్నారు. డీఆర్డీవో సాయాగౌడ్, ఏపీడీ రవీందర్, డీఈవో అశోక్, డీడబ్ల్యూవో రసూల్‌బీ, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ రాజశ్రీ తదితరులు ఉన్నారు.
300 మందికి 50 రోజుల ల్యాండ్ సర్వే ట్రైనింగ్..
భూభారతి చట్టంలో భాగంగా జిల్లాలో సెలెక్ట్ చేసిన 300 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు 50 రోజుల పాటు నిపుణుల వద్ద శిక్షణ ఇప్పిస్తామని కలెక్టర్ రాజీవ్‌గాంధీ తెలిపారు. సోమవారం ఆయన ట్రైనింగ్ క్యాంప్ ప్రారంభించి ప్రసంగించారు. సర్వే మ్యాప్, ఆధార్ మాదిరిగా రైతులకు భూధార్ నంబర్ల కేటాయింపులో సర్వేయర్ల పాత్ర కీలకమన్నారు. శిక్షణలో అన్ని విషయాలు నేర్చుకోవాలని జూలై 28, 29 తేదీల్లో నిర్వహించే ఎగ్జామ్‌లో మెరిట్ పొందిన వారికి ప్రభుత్వ లైసెన్స్ఇచ్చి సర్వేయర్లుగా అపాయింట్ చేస్తామన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ అశోక్ ఇన్స్పెక్టర్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.