
రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెరగాలని, ప్రతి మండలంలో మంజూరైన ఇండ్లు గ్రౌండింగ్ అయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ చేశారు. జిల్లాకు 8,811 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా.. వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు.
ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని, ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు నియంత్రణలో ఉండేలా మండల స్థాయి కమిటీలు పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ శంకర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆఫీసర్లు పాల్గొన్నారు. అంతకుముందు అంగన్‌వాడీ ఎగ్స్ ప్రొక్యూర్‌మెంట్‌పై కలెక్టరేట్‌లో ప్రీబిడ్ సమావేశం నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు ఏడాది పాటు అవసరమైన కోడి గుడ్లు సరఫరా చేసేందుకు టెండర్ ప్రక్రియ నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి కోడి గుడ్డుకు రూ.7 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుందని, ఆసక్తి గల వారు రూ.10వేలతో ‘జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రాజన్న సిరిసిల్ల’ పేరు మీద డీడీ తీసి టెండర్ దాఖలు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పశుసంవర్ధక శాఖ ఆఫీసర్ రవీందర్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ఆఫీసర్ రాజమనోహర్ రావు, డీఈవో వినోద్ కుమార్, వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మీరాజం పాల్గొన్నారు.