
గద్వాల, వెలుగు: నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకరణ కోసం నిధుల కొరత లేదని కలెక్టర్ సంతోష్ తెలిపారు. శుక్రవారం ధరూర్ మండల పరిధిలోని చింతరేవుల గ్రామాన్ని కలెక్టర్ సందర్శించి భూ సేకరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ వివరాలు, లేఅవుట్ మ్యాపు, పెగ్ మార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు.
రోజూ ఎంత మేర భూమి సర్వే చేశారు.. ఎన్ని ఎకరాలు పూర్తయిందనే వివరాలు ఎప్పటికప్పుడు స్పష్టంగా నమోదు చేసి రిపోర్ట్ ఇవ్వాలన్నారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఇరిగేషన్ ఎస్ ఈ రహీముద్దీన్, ఆర్డీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ భూపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.