జీవో 58, 59 గడువు పొడిగింపు

జీవో 58, 59 గడువు పొడిగింపు

సంగారెడ్డి టౌన్, వెలుగు:  జీవో 58 ,59 కింద దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం  ఈనెల 30 వరకు గడువు పొడగించిందని  కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు.  శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్లు, రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లతో ల్యాండ్ పూలింగ్, జీవో 58,59 దరఖాస్తుల స్వీకరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  అభ్యంతరం లేని ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు కటాఫ్ తేదీని 2014 జూన్ 2  నుంచి 2020 జూన్ 2 వరకు పొడిగించిందని తెలిపారు.   అర్హులు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకునేలా ప్రచారం చేయాలని సూచించారు. గతంలో తిరస్కరించినా కూడా మళ్లీ అప్లై చేసుకోవచ్చన్నారు.  2020 జూన్ 2వ తేదీ లోపు సంబంధిత  స్థలం వారి ఆధీనంలో ఉన్నట్లు ఆధారాలు చూపాల్సి ఉంటుందన్నారు. జీవో 59 కింద పెండింగ్‌ ఉన్న రుసుము చెల్లింపులపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు.  ప్రతి మున్సిపాలిటీలో ల్యాండ్ పూలింగ్  కింద  25 ఎకరాలు గుర్తించి, ఈనెల 17 లోగా స్వాధీనం చేయాలని మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లను ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీలో ల్యాండ్ పూలింగ్ కింద సేకరించిన భూమిలో  లేఅవుట్  చేసి, లబ్ధిదారులకు ఎకరాకు 600 గజాల చొప్పున స్థలాన్ని ఇస్తారని కలెక్టర్ తెలిపారు. అసైన్డ్ ల్యాండ్‌ అయితే  భూయజమాని సమ్మతితో మాత్రమే భూ సేకరణ చేయాలని కలెక్టర్ సూచించారు.   మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు నగేశ్, రమేశ్ బాబు, అంబాదాస్, తహసీల్దార్లు పాల్గొన్నారు.