అధికారులు నిబద్ధతతో పని చేయాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్

అధికారులు నిబద్ధతతో పని చేయాలి :  కలెక్టర్ సిక్తా పట్నాయక్

మహబూబ్​నగర్(నారాయణ పేట), వెలుగు: అధికారులు నిబద్ధతతో పని చేస్తేనే ప్రగతి సాధ్యమవుతుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శాఖల వారీగా క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో యాస్పిరేషన్ నర్వ బ్లాక్ పై సమావేశం నిర్వహించారు. నర్వ మండలంలో రైతుల ఆదాయం పెంచే మార్గాలను ఆలోచించాలని, స్వయం సహాయక సంఘాల మహిళలకు జీవనోపాధి కల్పించే ప్రాజెక్టులు, నీటి సంరక్షణ పద్ధతులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని సూచించారు.

ఈ నెల 3న నీతి అయోగ్ సీఈవోతో  వీడియో కాన్ఫరెన్స్ ఉందని, ఆలోగా వినూత్న ప్రాజెక్టుల ప్రతిపాదనలను శాఖల వారీగా పంపించాలన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ ప్రణయ్ కుమార్, జడ్పీ సీఈవో శైలేశ్​కుమార్, హౌసింగ్ పీడీ శంకర్, డీఏవో జాన్ సుధాకర్, పీఆర్ ఈఈ హీర్యా నాయక్, డీఈవో గోవిందరాజులు, జిల్లా మత్స్యశాఖ అధికారి రహమాన్, మిషన్ భగీరథ డీఈ రంగారావు, డీపీవో సుధాకర్ రెడ్డి, నర్వ ఎంపీడీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలి 

పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. పేషెంట్లతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, కాన్పులు ఇక్కడే జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హాస్పిటల్​సూపరింటెండెంట్, వైద్యులు, సిబ్బంది ఉన్నారు.