
నర్సింహులపేట, వెలుగు : తమ వీధిలో రోడ్డు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, రోడ్డు వేయాలని ఓ చిన్నారి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంకను కోరింది. నర్సింహులపేటలో బుధవారం జరిగిన తెలంగాణ దశాబ్ది వేడుకలకు ఎమ్మెల్యే రెడ్యానాయక్, కలెక్టర్ శశాంక హాజరయ్యారు. మీటింగ్ పూర్తైన తర్వాత మండల కేంద్రానికి చెందిన వెటకారి వెంకట్రాములు కూతురు పూజిత కలెక్టర్ వద్దకు వచ్చింది. తమ వీధిలో సరైన రోడ్డు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, వర్షాకాలంలో బురదలోనే నడవాల్సి వస్తోందని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చింది. స్పందించిన కలెక్టర్ బాలిక ఉండే వీధిని పరిశీలించి ఆఫీసర్లను ఆదేశించారు. కాగా సమస్యను వివరించిన చిన్నారిని కలెక్టర్ అభినందించారు.