హనుమకొండ, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తూ.. సిజేరియన్లను తగ్గించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై డీఎంహెచ్వో అప్పయ్యతో కలిసి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరకాల దవాఖానలో ప్రతి నెలా కనీసం 50, కమలాపూర్ లో 15 ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిజేరియన్లు ఎక్కువ అవుతున్న ఆస్పత్రుల్లో సీ సెక్షన్ ఆడిట్ నిర్వహించాలని చెప్పారు.
టీబీ ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా టీబీ వచ్చే అవకాశం ఉన్న 1.98 లక్షల మందిలో 1.17 లక్షల మందికి స్క్రీనింగ్ చేసి, 432 పోషణ కిట్లు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా అందరికీ స్క్రీనింగ్ చేసి, ఎక్స్ రే తీయాలని కలెక్టర్సూచించారు. హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి, అడిషనల్ డీఎంహెచ్ వో మదన్మోహన్ రావు, జిల్లా ఆస్పత్రుల కోఆర్డినేటర్గౌతమ్ చౌహాన్, టీబీ కంట్రోల్ ఆఫీసర్ హిమబిందు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలి
హసన్ పర్తి, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కలెక్టర్ స్నేహ శబరీశ్ ఆదేశించారు. హసన్ పర్తి మండలంలోని జయగిరి, చింతగట్టు, కోమిటిపల్లి గ్రామాల్లో గురువారం ఆమె పర్యటించారు. కోమటిపల్లి, చింతగట్టులోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. కోమటిపల్లి అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి, ప్రతీరోజు ఎంతమంది చిన్నారులు వస్తున్నారని టీచర్ ను అడిగి తెలుసుకున్నారు. జయగిరిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కొనుగోలును ఎందుకు ఆలస్యం చేస్తున్నారని నిర్వాహకులను ప్రశ్నించారు. వడ్లను త్వరగా కొనుగోలు చేసి, మిల్లులకు తరలించాలని సూచించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మహేందర్, తహసిల్దార్ కిరణ్ కుమార్, హౌసింగ్పీడీ హరికృష్ణ తదితరులున్నారు.
